ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో  జరిగిన మ్యాచ్ లో శిఖర్ ధవన్ తీవ్రంగా గాయపడి టీమిండియా తుది జట్టులో చోటు కోల్పియిన విషయం తెలిసిందే. అయితే ఇలా గాయంతో జట్టులో దూరమైనప్పటికి అతడితో కొద్దిపాటి ఆందోళన కూడా కనిపించడం లేదు. ఎప్పటిమాదిరిగానే జట్టు సభ్యులతో కలిసి ఫిట్ నెస్ ను కాపాడుకునే పనిలో పడ్డాడు. అంతేకాదు సహచరులను ఎప్పటిలాగే సరదాగా ఆటపట్టిస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతున్నాడు. ఇలా తాజాగా జిమ్ లో ఆల్ రౌండర్ హర్దిక్ పాండ్యా వేషధారణపై సైటైర్లు వేస్తూ దిగిన ఓ సరదా ఫోటోను ధవన్ స్వయంగా తన వ్యక్తిగత ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

టీమిండియా ఆటగాడు హార్ధిక్ పాండ్యా వేషధారణలో సాధారణంగా కాకుండా కొంచెం వింతగా వుండే విషయం మనందరికి తెలిసిందే. వెరైటీ హెయిర్ స్టైల్, ఒంటిపై విచిత్రమైన టాటూలతో పాటు మెడలో లావుపాటి గొలుసులతో  కనిపిస్తాడు. అయితే పాండ్యాను తనదైన రీతిలో ఆటపట్టించి ధవన్ ఓ పెద్ద చైన్ ను మెడలో వేసుకుని అతడితో కలిసి ఫోటో దిగాడు. 

ఇదే సమయంలో వీరిద్దరి వెనకాల వున్న టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ ఎటో చూస్తూ నోరెళ్లబెట్టాడు. దీంతో ధవన్ అతన్ని  కూడా వదల్లేదు. తమ ఇద్దరిని వింత వేషదారణపు చూసే భువనేశ్వర్ రియాక్షన్ అలా వుందంటూ ట్విట్టర్ లో ఈ ఫోటోను పోస్ట్ చేశాడు. 
 
అయితే  ధవన్ సరదా కోసమే ఈ ట్వీట్ చేసినా అభిమానులకు మరో విధంగా అర్థమయ్యింది. అతడు ఇదివరకు కూడా గాయంతో చేతికి కట్టుకుని మరీ జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా పాండ్యాను ఆటపట్టించిన ఫోటో కూడా జిమ్ లోదే. కాబట్టి తిరిగి జట్టులోకి రావాలన్ని కసితో అతడు  ఎక్కువసేపు జిమ్ లోనే గడుపుతున్నట్లు అర్థం చేసుకున్న అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. త్వరగా ధవన్ కోలుకుని జట్టులోకి రావాలంటూ అభిమానులు ఈ పోస్ట్ కు కామెంట్లు పెడుతున్నారు.