ప్రపంచ కప్ టోర్నీ కోసం  అప్ఘానిస్థాన్ జట్టులో ఎంపికైన మహ్మద్ షహజాద్ జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. పాకిస్థాన్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో అతడికి తగిలిన గాయం తిరగబెట్టడం వల్లే జట్టులోంచి తొలగించాల్సి వచ్చిందని అప్ఘాన్ టీం మేనేజ్ మెంట్ ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై తాజాగా షెహజాద్ సంచలన ఆరోపణలు చేశాడు. తనను కావాలనే వరల్డ్ కప్ టోర్నీ నుండి గెంటేశారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. 

షెహజాద్ నేరుగా అప్ఘాన్ క్రికెట్ బోర్డు, కెప్టెన్, డాక్టర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరందరు కలిసి తనపై కుట్రలు పన్నారని...అందులో భాగంగానే తాను ఫిట్ గా లేనని  నిర్ధారించి జట్టులోంచి తొలగించారని ఆరోపించాడు. గాయం తర్వాత రెండు మ్యాచులాడిన తాను ఆ తర్వాత ఒక్కసారిగా ఫిట్ నెస్ ఎలా కోల్పోతానని ప్రశ్నించారు. అప్పటి పరిస్థితులు, జరిగిన సంఘటనలకు బట్టి చూస్తే తనను ఎందుకోసమో తనను బలిపశువును చేశారని అర్థమవుతోందని షహజాద్ తెలిపాడు. 

నాకు ఈ ప్రపంచ కప్ మొత్తంలో ఆడే ఫిట్ నెస్ వుంది. కానీ తమ జట్టు ఫిజియోను ఉపయోగించుకుని కెప్టెన్ నయిబ్, బోర్డు పెద్దలు తనను జట్టులోంచి తొలగించేందుకు కుట్రలు చేశారని ఆరోపించాడు. తమ జట్టు కోచ్, సహచర ఆటగాళ్లకు తెలియకుండానే సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. వీరందరికి కాదు తనకు కూడా అధికారికంగా ప్రకటించిన తర్వాతే ఈ విషయం తెలిసిందని వెల్లడించాడు. తనకు అన్యాయం చేసిన వారిపై న్యాయపోరాటానికి దిగుతానని షహజాద్ ప్రకటించాడు.