టీమిండియా సీనియర్ ఆటగాడు  మహేంద్ర సింగ్ ధోనిపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ధోని మునుపటిలా దాటిగా ఆడలేకపోతున్న విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన మంజ్రేకర్ అతడు శారీరక సమస్య(వయసు మీదపడటం) తో పాటు మానసిక సమస్యతోనూ ఇబ్బంది పడుతున్నట్లు వ్యాఖ్యానించాడు. ధోని స్లో బ్యాటింగ్, పేలవమైన వికెట్ కీపింగ్ ను చూస్తే తనకా అభిప్రాయం కలిగినట్లు పేర్కొన్నాడు. 

బర్మింగ్ హామ్ లో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ బంగ్లాపై టీమిండియా విజయాన్ని అందుకుంది. దీంతో జట్టును అభినందిస్తూనే మంజ్రేకర్ ట్విట్టర్ ద్వారా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. '' ఇక్కడ ధోనికి సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ ప్రపంచ కప్ టోర్నీలో అతడు స్పిన్నర్లును ఎదుర్కొని 87 బంతులాడగా 41 పరుగులు మాత్రమే చేశాడు. కానీ ఈ టోర్నీ ఆరంభానికి  ముందు జరిగిన వార్మప్ మ్యాచుల్లో మాత్రం 56 బంతుల్లో 69 పరుగులు చేశాడు.  దీన్ని బట్టి ధోని మానసిక సమస్యతో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. వికెట్ ను కాపాడుకోవడంపై పెట్టిన శ్రద్ద పరుగులు సాధించి భారీ ఇన్నింగ్స్ లు నెలకొల్పడంపై ధోని పెట్టడంలేదు'' అంటూ ట్వీట్ చేశాడు. 

మరో ట్వీట్ లో '' ధోనిపై స్పాట్ లైట్ వేయడం  ఇక ఆపండి. దాన్నిక లోకేష్ రాహుల్ పైకి షిప్ట్ చేయండి. అంతర్జాతీయ క్రికెట్లో రాహుల్ చాలా కీలకమైన పరిస్థితుల్లో వున్నాడు. వన్డేల్లో ఓపెనర్ గా అతడు తన శక్తికి మించిన పని చేస్తున్నాడు. కాబట్టి ధోనిని కాకుండా రాహుల్ ని హైలైట్ చేయండి''  అంటూ సూచించాడు. 

''బంగ్లాపై  టీమిండియా గెలిచినా ఈ  మ్యాచ్ ద్వారా మరికొన్ని సమస్యలు బయటపడ్డాయి. రాహుల్ ఇంకా ఓపెనర్ గా ఆత్మవిశ్వాసంతో ఆడలేకపోతున్నాడు. షమీ డెత్ ఓవర్లలో బౌలర్‌ షమీ ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాడు. ఇక ధోని తికమక ఇంకా కొనసాగుతోంది'' అంటూ ప్రతిసారి మంజ్రేకర్ ధోనిని విమర్శించాడు. దీంతో అభిమానులు మంజ్రేకర్ ట్వీట్స్ పై వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.