ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా మరోసారి తానే హాట్ ఫేవరెట్ అని నిరూపించుకుంది. ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుపై విజయం సాధించి... ఆస్ట్రేలియా వంటి ఛాంపియన్ జట్టుతో హోరాహోరీగా  పోరాడి ఓడి మంచి ఊపుమీదున్నట్లు కనిపించిన పాకిస్థాన్ జట్టు  టీమిండియా చేతిలో మాత్రం చిత్తుచిత్తుగా ఓడింది. నిన్న (ఆదివారం) జరిగిన మ్యాచ్ లో భారత్ 89 పరుగుల తేడాతో పాక్ పై ఘనవిజయం సాధించింది. 

అయితే ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లను చితక్కొట్టి కేవలం 113 బంతుల్లోనే 140 పరుగులతో రోహిత్ అద్భుత సెంచరీని అందుకున్నాడు. ఇలా పాక్ ముందు భారత్ 337 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించడంలో కీలక పాత్ర పోషించి భారత్  కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇలా తన అత్యుత్తమ ప్రదర్శనతో రోహిత్ యావత్ భారతీయుల అభిమానాన్ని చూరగొన్నాడు.  

అయితే అతడు బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఓ అద్భుతమైన షాట్ తో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ను గుర్తుచేశాడు. 2003 ప్రపంచ కప్ లో ఇదే పాకిస్థాన్ పై జరిగిన మ్యాచ్ సచిన్ కళాత్మకమైన షాట్లతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన శరీరానికి కొద్ది ఎత్తులో వచ్చిన బంతిని అతిసునాయాసంగా  అప్పర్ కట్ గా మలిచి బౌండరీకి తరలించాడు. సూమ్ టు సేమ్ అలాంటి షాటే ఈ మ్యాచ్ లో రోహిత్ ఆడాడు. 

దీంతో వీరిద్దరి సిక్సర్లకు సంబంధించిన వీడియోను పక్కపక్కన పెట్టిన ఐసిసి అభిమానులకు ఓ పోల్ పెట్టింది.  ''2003 లో సచిన్, 2019 లో రోహిత్...ఎవరు అత్యుత్తమంగా ఆడారో చెప్పండి'' అంటూ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేస్తే ఆ వీడియోను దీనికి జతచేసింది.