ప్రపంచ కప్ టోర్నీలో వరుస సెంచరీలతో  టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ పరుగుల వరద  పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. తాజాగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా రోహిత్ పరుగుల వేట కొనసాగింది. దీంతో ఈ టోర్నీలో అత్యధిక పరుగులు(544) సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. దీంతో అతడికి టీమిండియా మాజీ ప్లేయర్, 2011 ప్రపంచ కప్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ గ్రహీత యువరాజ్ సింగ్ అభినందించాడు. అయితే ఈ విషయంపై ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ పీటర్సన్, యువీల ఆసక్తిరమైన సంభాషణ సాగింది. 

బంగ్లాపై కూడా సెంచరీతో అదరగొట్టి టాప్ స్కోరర్ గా నిలిచిన రోహిత్ ను యువీ ఈ విధంగా  అభినందించాడు.  ''ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఐసిసి మ్యాచ్ ఆఫ్ ది సీరిస్ కు చేరువ అవుతున్నావు.  అద్భుతమైన నాలుగో సెంచరీ సాధించిన హిట్ మ్యాన్(రోహిత్ శర్మ) కు అభినందనలు. చాలా బాగా ఆడావు ఛాంపియన్'' అంటూ ట్విట్టర్ ద్వారా  యువీ అభినందించాడు.  

అయితే ఈ  ట్వీట్ పై ఇంగ్లాండ్ పై మాజీ ప్లేయర్ పీటర్సన్ కాస్త వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. '' ఒకవేళ ఇంగ్లాండ్ ప్రపంచ కప్ గెలవకుంటేనే నువ్వు కోరుకున్నది సాధ్యమవుతుంది''  అని పేర్కొన్నాడు. దీంతో యువీకి చిర్రెత్తుకొచ్చి ఘాటుగా సమాధానమిచ్చాడు. '' ముందు సెమీఫైనల్ కు క్వాలిఫై కండి. ఆ తర్వాత గెలుపు గురించి మట్లాడొచ్చు. అయినా నేను మాట్లాడేది మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గురించి... గెలుపు గురించి కాదు'' అంటూ సెటైర్ విసిరాడు. 

యువీ  సమాధానంతో దిమ్మతిరిగినట్లుంది. పీటర్సన్ మళ్లీ జవాభివ్వలేదు.  ఇలా అనవసరంగా యువీని గెలికి మరీ తాను అబాసుపాలవడమే కాదు ఇంగ్లాండ్ టీంపై కూడా  సైటైర్లు పడేలా చేశాడు పీటర్సన్.