ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ కు టీమిండియా క్రికెటర్ శిఖర్ ధవన్ దూరమైన విషయం తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో మ్యాచ్ సందర్భంగా ధవన్ బొటనవేలికి గాయమవడంతో మూడు వారాల పాటు భారత జట్టులో చోటు కోల్పోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారన్నదానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ధవన్ స్థానంలో ప్రపంచ కప్ ఆడే అవకాశం రిషబ్ పంత్ కు తప్ప మరెవరికి లేదని బిసిసిఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దీంతో ఊహాగానాలన్నిటికి తెరపడింది. 

ఇండియా-న్యూజిలాండ్ లు రేపు(గురువారం) నాటింగ్ హామ్ మైదానంలో తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ధవన్ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఇవాళే(బుధవారం) ఇంగ్లాండ్ కు చేరుకోవాల్సి వుంటుంది. కాబట్టి ఇప్పటికే రిషబ్ పంత్ కు బిసిసిఐ నుండి పిలుపు అందినట్లు సమాచారం. వెంటనే ఇంగ్లాండ్ కు పయనమవ్వాల్సిందిగా అతడిని బిసిసిఐ సూచించినట్లు ఓ అధికారి తెలిపారు.  

అయితే న్యూజిలాండ్ తో జరగనున్న మ్యాచ్ లో పంత్ ఆడతాడా...లేదా అన్నది టీం మేనేజ్ మెంట్ నిర్ణయంపై ఆదారపడి వుంటుంది. కానీ క్రీడా విశ్లేషకులు మాత్రం పంత్ ను నాలుగో స్థానంలో ఆడించి కెఎల్ రాహుల్ ను ఓపెనర్ గా బరిలోకి దించితే మంచి ఫలితాలుంటాయని అభిప్రాయపడుతున్నారు. అభిమానులు కూడా పంత్ ను తుది జట్టులో ఆడించాలని కోరుతున్నారు.