ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలను అందుకున్న టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించి టీమిండియా విజయంలో ఓపెనర్ శిఖర్ ధావన్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇలా ఫామ్ లోకి వచ్చిన ఇదే మ్యాచ్ లో ధావన్ బొటనవేలికి గాయమై ఏకంగా ప్రపంచ కప్ టోర్నీకే దూరమవ్వాల్సి వచ్చింది. దీంతో ధావన్ స్థానంలో భారత జట్టులోకి ఎవరు వస్తారా అన్న దానిపై క్రికెట్ వర్గాల్లోన్నే కాదు అభిమానుల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతోంది. 

అయితే గతంలో ప్రపంచ కప్ లో చోటు ఆశించి భంగపడ్డ యువ క్రికెటర్ రిషబ్ పంత్ పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే అతడి కంటే అనుభవజ్ఞుడైన అజింక్యా రహానేకు  ఈ అవకాశం ఇవ్వాలని కొందరు అభిమానులు బిసిసికి సూచిస్తున్నారు. అనుభవం లేదనే కదా పంత్ ని కాదని ధినేశ్ కార్తిక్ కు అవకాశమిచ్చారు...అలాగే  ఇప్పుడు కూడా అదే మాదిరిగా రహానేకు చాయిస్ ఇవ్వాలని కోరుతున్నారు. 

కేవలం రహానేకు మద్దతుగా నిలవడమే కాదు...బ్రింగ్ రహాన్ బ్యాక్ (#bringrhananeback)హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఓ ప్రచారాన్నే మొదలుపెట్టారు. రహానే భారత జట్టు తరపున ప్రపంచ కప్ ఆడితే ప్రయోజనం వుంటుందనుకుంటున్న వారంతా ఈ హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగించి ట్విట్టర్ ద్వారా మద్దతు తెలపాలని కోరుతున్నారు. 

రహానేను జట్టులోకి తీసుకోవడం వల్ల కలిగే లాభాలను కూడా వారు వివరిస్తున్నారు. కెఎల్ రాహుల్ నాలుగో స్థానంలో చక్కగా ఆడుతున్నాడు కాబట్టి అతడిని అక్కడే  ఆడించి రహానేను ఓపెనర్ గా బరిలోకి దించొచ్చంట. అతడు గతంలో కూడా ఓపెనింగ్ చేసిన అనుభవం వుంది కాబట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతే సంయమనంలో ఆడుతూ వికెట్ కాపాడుకుంటూ పరుగులు సాధించే రహానే క్లిష్ట సమయాల్లో జట్టును ఆదుకుంటాడని బిసిసిఐకి సూచిస్తున్నారు.