Asianet News TeluguAsianet News Telugu

కివీస్ ఓటమి: చిగురించిన పాకిస్తాన్ ఆశ, కానీ...

జూన్ 16వ తేదీన ఇండియాపై ఓడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ లపై వరుసగా విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. 

World Cup 2019 Qualification Scenarios: How Pakistan can still qualify for the semi-finals
Author
London, First Published Jul 4, 2019, 8:00 AM IST

లండన్: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచులో ఇంగ్లాండు న్యూజిలాండ్ పై భారీ తేడాతో విజయం సాధించడంతో పాకిస్తాన్ ఆశలు చిగురించాయి. పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు చేరుకోవడం ఈ మ్యాచ్ పై ఆధారపడి ఉండింది. అయితే, పాకిస్తాన్ సెమీ ఫైనల్ చేరుకోవడం బంగ్లాదేశ్ తో శుక్రవారం ఆ జట్టు గెలిచే తీరుపై ఆధారపడి ఉంటుంది.

న్యూజిలాండ్ పై విజయం ద్వారా ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఇండియా ఇది వరకే సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. 12 పాయింట్లతో సెమీ ఫైనల్ కు చేరుకున్న మూడో జట్టు ఇంగ్లాండు. న్యూజిలాండ్ పై 119 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడం ద్వారా 1992 తర్వాత ఇంగ్లాండు మరోసారి సెమీ ఫైనల్ కు చేరుకుంది.

శ్రీలంక, ఆస్ట్రేలియాలపై ఓడిపోయి సెమీ ఫైనల్ చేరుకునే స్థితిని క్లిష్టం చేసుకున్న ఇంగ్లాండు ఇండియాపై విజయం ద్వారా ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయినప్పటికీ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. జూన్ 16వ తేదీన ఇండియాపై ఓడిపోయిన పాకిస్తాన్ ఆ తర్వాత దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్ లపై వరుసగా విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలను మెరుగుపరుచుకుంది. 

ఇంగ్లాండుపై ఓటమి పాలైనప్పటికీ న్యూజిలాండ్ సెమీ ఫైనల్ చేరుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. పాకిస్తాన్ కు నిరాశ తప్పక పోవచ్చు. అన్ని మ్యాచ్‌లూ ఆడేసిన కివీస్‌ ఇప్పుడు 11 పాయింట్లతో ఆస్ట్రేలియా (14), భారత్‌ (13), ఇంగ్లాండ్‌ (12)ల తర్వాత నాలుగో స్థానంలో ఉంది. 

న్యూజిలాండ్ జట్టు నెట్‌    రన్‌రేట్‌ 0.175. 9 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్‌ ఐదో స్థానంలో ఉంది. అయితే, బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే 11 పాయింట్లతో న్యూజిలాండ్ పాయింట్లను సమం చేస్తుంది. కానీ పాకిస్తాన్ నెట్‌ రన్‌రేట్‌    -0.792 ఉంది. నెట్ రన్ రేటులో న్యూజిలాండ్ మెరుగ్గా ఉంది. 

పాకిస్తాన్ నెట్ రన్ రేటును న్యూజిలాండ్ కన్నా మెరుగు చేసుకోవాలంటే బంగ్లాందేశ్ జట్టుపై అనూహ్యమైన పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. నెట్ రన్ రేటును మెరుగు పరుచుకోవాలంటే మొదట బ్యాటింగ్ చేస్తే పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై 400 పరుగులు చేయాల్సి ఉంటుంది. దానికితోడు బంగ్లాదేశ్ ను 84 పరుగులకు ఔట్ చేయాల్సి ఉంటుంది. 

పాకిస్తాన్ ఒకవేళ 350 పరుగులు చేస్తే బంగ్లాదేశ్ ను 38 పరుగులకు పెవిలియన్ చేర్చాల్సి ఉంటుంది. పాకిస్తాన్ 450 పరుగులు చేసి బంగ్లాదేశ్ ను 129 పరుగులకు ఔట్ చేయాల్సి ఉంటుంది.  

బంగ్లాదేశ్ ఆట తీరు చూస్తే పాకిస్తాన్ కు అది ఏ మాత్రం సులభం కాదనేది అర్థమవుతుంది. పైగా, తన చివరి మ్యాచ్ పాకిస్తాన్ పై విజయం సాధించి ప్రపంచ కప్ పోటీలను ముగించాలనే ఉద్దేశంతో బంగ్లాదేశ్ ఉంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios