ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఓ వృద్ద మహిళ సందడి అందరికీ గుర్తుండే వుంటుంది. 87 ఏళ్ళ వయసులోనూ క్రికెట్ పై ఆసక్తితో ఆమె మైదానికి వచ్చి మరీ టీమిండియాను సపోర్ట్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ఈ విషయాన్ని గమనించి ఆమె వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. దీంతో ఆ ఒక్క మ్యాచ్ ద్వారా ఆ వృద్ద అభిమాని చారులత పాటిల్ బాగా ఫేమస్ అయ్యారు. దీంతో అంతర్జాతీయ కంపనీ పెప్సీ ఆమెకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. 

టీమిండియా సూపర్ ఫ్యాన్ చారులతను తమ డిజిటల్ క్యాంపెయిన్ లో భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు పెప్సీ సంస్థ ఓ ప్రకటన చేసింది. ఇలా వృద్దాప్యంలోనూ ఆమె కేవలం భారత జట్టుకు అండగా నిలిచేందుకు మైదానానికి వచ్చి చూపించిన ఉత్సాహంగా తమను కూడా ఆకట్టుకుందని తెలిపారు. క్రికెట్ పై ఆమెకున్న మక్కువే ఈ అవకాశాన్ని కల్పించినట్లు పెప్సి తన ప్రకటనలో పేర్కొంది. 

టీమిండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ తర్వాత తన జీవితమే మారిపోయిందని చారులత ఇదివరకే వెల్లడించారు. ముఖ్యంగా శ్రీలంకతో టీమిండియా తలపడే మ్యాచ్ కు కూడా తనను కోహ్లీ స్వయంగా ఆహ్వానించడాన్ని మరిచిపోలేననియఅన్నారు. అందుకోసం అతడే స్వయంగా తనకు మ్యాచ్ టికెట్లు పంపించాడని... ఓ సాధారణ అభిమానినైన  తనపై కోహ్లీ చూపిస్తున్న ప్రేమను  మరిచిపోలేనని అన్నారు. అతడి మూలంగానే మళ్లీ  ఈ మ్యాచ్ చూడగలుగుతున్నట్లు చారులత ఇండియా-శ్రీలంక మ్యాచ్ సందర్భంగా వెల్లడించారు.