ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండో పాక్ మ్యాచ్ పాకిస్థాన్ క్రికెట్లో అలజడి రేపింది. భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన తర్వాత పాక్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ సర్పరాజ్ అహ్మద్ పై పాక్ అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. అతడి తప్పుల వల్లే దాయాది  దేశం చేతిలో పాక్ ఓడిపోవాల్సి వచ్చిందని వారు ఆరోపిస్తున్నారు. అయితే పిసిబి  మాజీ అధికారి  రాజు జమిల్ మాత్రం సర్ఫరాజ్ కు మద్దతుగా నిలిచాడు. ఆ ఓటమికి సర్పరాజ్ కేవలం ఒక కారణమై వుంటాడని...కానీ అసలు కారణం మరొకటి వుందంటూ సంచలన విషయాలు బయటపెట్టాడు. 

పాకిస్థాన్ టీం కెప్టెన్ గా సర్పరాజ్  కొనసాగడం కొందరు పిసిబి పెద్దలకు నచ్చడం లేదని రాజు అన్నారు. అందువల్లే జట్టులో ఆటగాళ్ల మధ్య చీలికలు తెచ్చి అతడి కెప్టెన్సీకకి చెడ్డపేరు తెచ్చేలా చూస్తున్నారు. ముఖ్యంగా ప్రస్తుత పాక్ ప్రపంచ కప్ జట్టులోని మహ్మద్ అమీర్, ఇమాద్ వసీం, ఇమామ్ ఉల్ హక్ ల గ్రూప్ సర్పరాజ్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని...వారికి చీఫ్ కోచ్ ఇంజమామ్ హక్ మద్దతు  కూడా వున్నట్లు రాజు తెలిపాడు. వీరు మైదానంలోనూ, డ్రెస్సింగ్ రూంలోనూ సర్పరాజ్ మాటను లెక్కచేయకుండా తమకు ఇష్టం  వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని తనకు సమాచారముందని అన్నారు.     

అలాగే సీనియర్ ఆటగాడు షోయయబ్ మాలిక్ కూడా సర్ఫరాజ్ కెప్టెన్సీని వ్యతరేకిస్తున్నాడని తెలిపారు. ఓ సమావేశంలో అతడే స్వయంగా తనకు ఈ విషయాన్ని చెప్పినట్లు రాజు పేర్కొన్నాడు. 

ఇలా వీరంతా కలిసి సర్ఫరాజ్ కు వ్యతిరేకంగా పనిచేస్తూ అతన్ని జట్టులో లేకుండా చేయాలని అనుకుంటున్నారు. జట్టు సభ్యుల మధ్య  జరుగుతున్న ఈ రాజకీయాల వల్లే ఆటగాళ్ళలో సమిష్టితత్వం  లేకుండాపోయిందన్నాడు. అందువల్ల భారత్  పై పాక్  ఓటమికి  ఇదే ప్రదాన కారణం...సర్పరాజ్ ఒక్కడే కాదని రాజు జమిల్ అభిప్రాయపడ్డాడు.