ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో యువ క్రికెటర్ రిషబ్ పంత్ అదరగొట్టిన విషయం తెలిసిందే. అదృష్టం కొద్ది ఈ మెగా టోర్నీలో ఆడుతున్న అతడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. మొదట ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నిరుత్సాహపర్చిన  అతడు బంగ్లాపై మాత్రం మిడిల్ ఆర్డర్ రాణిస్తూ 48 పరుగులు చేశాడు. అయితే పంత్ సాధించిన పరుగులు తక్కువగా వున్నా ఆ బ్యాటింగ్ స్టైల్ తననెంతో ఆకట్టుకుందని ఆసిస్ మాజీ కెప్టెన్ మెకెల్ క్లార్క్ అతడిపై ప్రశంసలు కురిపించాడు. 

ఇన్నాళ్లు నాలుగో స్థానంలో ఆడే సరైన బ్యాట్స్ మెన్ లేక ఇబ్బంది పడుతున్న టీమిండియాకు పంత్ రూపంలో మంచి ఆప్షన్ దొరికిందన్నాడు. ఆ స్థానానికి న్యాయం చేస్తాడన్న నమ్మకం బంగ్లా తో అతడు ఆడిన ఇన్నింగ్స్ ద్వారా కలిగిందని పేర్కొన్నాడు. పంత్ తక్కువ పరుగులే చేసినా అతడి షాట్స్ ఎంపిక అత్యద్భుతంగా వుందన్నాడు. ఏ బంతిని ఎలా గౌరవించాలో తెలిసిన  తెలివైన ఆటగాడు పంత్ అని క్లార్క్ కొనియాడాడు. 

టీమిండియాకు మిడిల్ ఓవర్లలో పరుగులు సాధించిపెట్టే బ్యాటిగ్ స్టైల్ రిషబ్ పంత్ దని తెలిపాడు.  నాలుగో స్థానంలో అతన్ని కొనసాగిస్తూనే ఆరో స్థానంలో దినేశ్ కార్తిక్ ను ఆడించాలని సూచించాడు. అనుభవజ్ఞుడైన అతడు లోయర్ ఆర్డర్ తో కలిసి భాగస్వామ్యాన్ని నెలకొల్పగలడని...ఇది టీమిండియాకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపాడు. వీరిద్దరిని  ఇదే స్థానాల్లో ఆడిస్తే ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు మరిన్ని మంచి రాబట్టగలదని క్లార్క్ అభిప్రాయపడ్డాడు.