లండన్ లోని ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచ కప్ లీగ్ దశలో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్ లో పాక్ తప్పకుండా గెలిచితీరాల్సిన పరిస్థితి. బంగ్లాను 300పైచిలుకు పరుగులతో ఓడిస్తేనే పాక్ సెమీస్ కు చేరుకునే అవకాశాలున్నాయి. ఇలాంటి కీలక మ్యాచ్ లో ఇమామ్ సెంచరీతో అదరగొట్టాడు. 

అంతకు ముందు బౌండరీలతో విరుచుకుపడుతూ సెంచరీకి చేరువైన బాబర్ శతకాన్ని మాత్రం పూర్తిచేసుకోలేకపోయాడు. 96 పరుగులు చేసిన అతడు సెంచరీకి మరో నాలుగు పరుగులు దూరంలో వుండగా సైఫుద్దిన్ బౌలింగ్ లో ఔటయ్యాడు. బాబర్ ను వికెట్ల ముందు  అడ్డంగా దొరికిపోయాడు. అయితే అతడి ఎల్బీడబ్యూ పై రివ్యూ కోరినా ఫలితం లేకుండా పోయింది. థర్డ్ అంపైర్ కూడా గ్రౌండ్ అంపైర్ నిర్ణయమే సరైనదిగా తేల్చడంతో బాబర్ నిరాశతో పెవిలియన్ బాట పట్టాడు. 

 ఆరంభంలోనే ఫకార్ జమాన్ వికెట్ కోల్పోయిన పాక్ ఇమామ్, బాబర్ లే ఆదుకున్నారు. మరో వికెట్ పడకుండా మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించారు. ఈ క్రమంలోనే బాబర్ సెంచరీ మిస్సయ్యాడు. అయితే ఇమామ్ మాత్రం 96  బంతుల్లో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అయితే శతకాన్ని బాదిన వెంటనే ఇమామ్ హిట్ వికెట్ రూపంలో వికెట్ ను చేజేతులా సమర్పించుకున్నాడు. 

ఆ తర్వాత వెంటవెంటనే హఫీజ్, సోహైల్ వికెట్లను కూడా పాక్ కోల్పోయింది. దీంతో సునాయాసంగా 300 పరుగులు చేస్తుందనుకున్న పాక్ కష్టపడాల్సి వస్తోంది.   ప్రస్తుతం పాక్ 47 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది.