ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాక్ జట్టుపై విమర్శల వర్షం కురుస్తున్న విషయం తెలిసిందే. మరీ  ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ వ్యవహరించిన తీరు, తీసుకున్న నిర్ణయాలపై పాక్ మరీ ఎక్కువ విమర్శలపాలయ్యాయి. కేవలం అభిమానులే కాదు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, సాధారణ  ప్రజలు కూడా సర్ఫరాజ్ తీవ్ర  స్థాయిలో ద్వజమెత్తారు. కొందరు అభిమానులయితే ఏకంగా అతడి  ఎదురుగానే దుర్భాషలాడుతూ తీవ్రంగా అవమానించారు కూడా. అలా సర్ఫరాజ్ ను  ఓ బహిరంగ ప్రదేశంలో అవమానించిన ఓ అభిమాని తన తప్పు తెలుసుకుని తాజాగా  క్షమాపణలు చెప్పాడు. 

ఇటీవల సర్ఫరాజ్ తన  తనయుడితో కలిసి లండన్ లోని  ఓ షాపింగ్ మాల్ కు వెళ్లాడు. ఇదే  సమయంలో వారికి ఓ పాక్ అభిమాని  సెల్పీ కావాలని అడిగాడు. అందుకు సర్ఫరాజ్ అంగీకరించినప్పటికి కొడుుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయిన అభిమాని '' సర్ఫరాజ్...ఎందుకలా పందిలా బలిసావ్...డైట్ పాటిస్తూ ఫిట్ గా వుండొచ్చుగా'' అంటూ  అతడు వింటుండగానే అవమానకరనంగా మాట్లాడాడు. సర్ఫరాజ్ మాత్రం ఆ మాటలను పట్టించుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు. 

అయితే ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్  గా మారింది. అంతకు ముందు వరకు సర్ఫరాజ్ ను విమర్శించిన వారు కూడా ఆ  అభిమాని దురుసు ప్రవర్తనన  వ్యతిరేకించారు. ఓ ఆటగాడి పట్ల అలా వ్యవహరించడాన్ని అంతర్జాతీయ సమాజం కూడా అంగీకరించలేదు . దీంతో సదరు అభిమాని  వ్యవహారశైలిని  తప్పుబడుతూ అభిమానులు కామెంట్స్ చేయడమే కాదు...సర్పరాజ్ కు మద్దతుగా నిలిచారు. 

దీంతో సర్ఫరాజ్ ను అవమానించి అభిమాని తన తప్పు తెలుసుకున్నాడు. దీంతో క్షమాపణలు చెబుతూ మరో వీడియో రూపొందించి విడుదల చేశాడు. ''స్వతహాగా పాక్ దేశీయుడినైన నేను మా క్రికెట్ జట్టు కెప్టెన్ ను అవమానించేలా మాట్లాడటం  పట్లు విచారం వ్యక్తం చేస్తున్నాను. నా వ్యవహారం, మాటలతో బాధపడ్డ సర్పరాజ్ కు క్షమాపణలు చెబుతున్నా. అలాగే ఈ వ్యవహారం మూలంగా బాధపడ్డ ప్రతి ఒక్కరిని క్షమించమని కోరుతున్నా. నేను చేసింది  ముమ్మాటికి  తప్పే... కానీ ఆ వీడియోను  సోషల్ మీడియాలో మాత్రం నేనే అప్ లోడ్ చేయలేదు. అదెలా వచ్చిందో నాకిప్పటికి అర్థం కావడం లేదు. నేనలా దూషిస్తున్న సమయంలో సర్ఫరాజ్ తో పాటు వున్నది అతడి కొడుకని  నిజంగా  నాకు తెలీదు.'' అంటూ సదరు అభిమాని విచారం వ్యక్తం చేశాడు.