ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు కేవలం ఒకే ఒక విజయాన్ని అందుకుంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్  మాటతీరులోనే పూర్తి మార్పు వచ్చింది. అంతకు ముందు వరుస ఓటములతో సతమతమైన ఆ జట్టు ఇటీవల ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో కాస్త బాగా ఆడి విజయాన్ని అందుకుంది. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ కళ్లు నెత్తికెక్కి సెల్ఫ్ డబ్బా మొదలెట్టాడు. 

శుక్రవారం శ్రీలంక తో పాక్ తలపడాల్సి వుండగా  వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. దీంతో ఇరు జట్టు చెరో పాయింట్ ను పొందాయి. ఈ సందర్భంగా పాక్  కెప్టెన్ సర్ఫరాజ్ మాట్లాడుతూ...'' ఇంగ్లాండ్ పై విజయం తర్వాత మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది.  అదే ఊపును శ్రీలంకపై కూడా చూపించాలనుకున్నాం. కానీ వర్షం మాకు ఆ అవకాశాన్ని ఇవ్వలేదు. తదుపరి ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ లో మా ఆటగాళ్ళు అత్యుత్తమ ప్రదర్శన చేస్తారని నమ్ముతున్నాను.

ప్రస్తుతం మా జట్టు ఫామ్ ను చూసి మిగతా జట్లన్ని భయపడిపోతున్నాయి. విండీస్ పై ఘోర ఓటమి చవిచూసిన తర్వాత ఒత్తిడికి లోనవకుండా ఇంగ్లాండ్ పై    ప్రదర్శించిన పోరాటమే అందరు భయపడటానికి కారణం. అలాంటి అద్భుత  ప్రదర్శన చేయడంతో పాక్ జట్టుకు మాత్రమే సాధ్యమయ్యింది'' అని సర్ఫరాజ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాడు.