ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మొదటి ఓటమిని చవిచూసింది. ఆతిథ్య ఇంగ్లాండ్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో భారత్ 338 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగి కేవలం 306 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 31 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. అయితే ఈ ఓటమితో ఇండియా పెద్దగా నష్టపోనప్పటికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ లపై ప్రభావం చూపించింది. దీంతో ఆ దేశాలకు చెందిన మాజీ క్రికెటర్లు, మీడియా, అభిమానులు టీమిండియా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆ జాబితాలోకి మాజీ పాక్ క్రికెటర్ వకార్ యూనిస్ చేరిపోయాడు. 

ఇంగ్లాండ్ పై భారత్ కావాలనే ఓడిపోయిందంటూ అతడు తన అసహనాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లగక్కాడు.  భారత్-ఇంగ్లాండ్ ల మధ్య జరిగిన మ్యాచ్ క్రీడాస్పూర్తికి విరుద్దంగా జరిగిందంటూ పరోక్ష ఆరోపణలు చేశాడు. '' నువ్వు ఎవరన్నది కాదు... జీవితకాలంలో నువ్వు ఏం చేశావన్నది నువ్వు ఎవరో తెలియజేస్తుంది. పాకిస్థాన్ ఈ ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరుతుందా...లేదా అన్నదానిపై నాకు బాధ లేదు. కానీ ఒక్క విషయం  మాత్రం ఖచ్చితంగా చెప్పగలను... కొన్ని చాంపియన్ల క్రీడాస్పూర్తిని పరీక్షించగా అవి దారుణంగా విఫలమయ్యాయి.''  అని పేర్కొంటూ ఇండియాVsఇంగ్లాండ్, సిడబ్యూసి2019 యాష్ ట్యాగ్ ను జోడించి ట్వీట్ చేశాడు. 

ఇలా అతడు పరోక్షంగా టీమిండియా ఆటతీరు క్రీడాస్పూర్తికి విరుద్దంగా సాగిందంటూ విమర్శలకు దిగాడు. అంతేకాదు ఇంగ్లాండ్ కూడా అదే పని చేసిందంటూ వ్యాఖ్యానించాడు. ఈ  ట్వీట్ ద్వారా వకార్ తన అసహనం మొత్తాన్ని భయటపెట్టాడు. 

అయితే ఇప్పటికే పాక్ అభిమానులు కూడా విధంగా టీమిండియాపై అనవసరంగా దుమ్మెత్తిపోస్తున్నారు. ముఖ్యంగా ధోని వంటి ఫినిషర్ చివరి వరకు నాటౌట్ గా నిలిచినా  భారత జట్టు ఓడిపోవడంపై వారు అనుమానం  వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు ఆలౌట్ అయ్యుంటే ఫరవాలేదు...కానీ బ్యాట్ మెన్స్ క్రీజులో వుండి కూడా ఓడిపోవడం ఆశ్యర్యాన్ని కలిగించిందని పాక్ అభిమానులు ఆరోపిస్తున్నారు. తమ సెమీస్ అవకాశాలను దెబ్బతీయడానికే టీమిండియా ఆటగాళ్లు క్రీడాస్పూర్తిని విస్మరించారంటూ వారు ఆరోపిస్తున్నారు.