ప్రపంచ కప్ టోర్నీలో భారత్ మరోసారి పాక్ ను చిత్తు చేసిన విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగా గత ఆదివారం జరిగిన మ్యాచ్ లో టీమిండియా 89 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. భారత్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన పాక్ పై సొంతదేశంలో విమర్శల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా అభిమానులు, మాజీ ఆటగాళ్లు పాక్ జట్టుపై, ఆటగాళ్లపై విరుచుకుపడుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది కూడా తమ ఆటగాళ్ల చెత్త ప్రదర్శన కారణంగానే పాక్ ఓటమిపాలవ్వాల్సి వచ్చిందని ఆరోపించారు.

ముఖ్యంగా పాక్ బౌలింగ్, ఫీల్డింగ్ విషయంలో చాలా మెరుగుపడాల్సి వుందని అన్నారు. భారత్ పై జరిగిన మ్యాచ్ లో ఈ రెండు విభాగాలే కోలుకోలేని దెబ్బతీశాయని అన్నారు. ఏ జట్టులో అయితే అత్యుత్తమ ఫీల్డర్లుంటారో ఆ జట్టుకు గెలుపు అవకాశాలు ఎక్కువగా వుంటాయన్నారు. ఏ జట్టు గెలుపయినా 70-80 శాతం ఫీల్డింగ్ పైనే  ఆధారపడి వుంటుందని అఫ్రిది తెలిపారు. 

టీమిండియా ఆ  విషయంలో చాలా మెరుగ్గా వుందన్నారు. కానీ పాక్ ఫీల్డింగ్ విభాగంలో ఇంకా చాలా వెనుకబడి వుందన్నారు. అందువల్లే మాంచెస్టర్ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ కి చాలాసార్లు  లైఫ్ లభించిందని తెలిపారు. ఈ తప్పులు చేయకుండా వుంటే పాక్ గెలుచే అవకాశాలుండేవని అఫ్రిది పేర్కొన్నారు. 

ఇక భారత్ లోని అత్యుత్తమ ఆటగాళ్లను వెలికితీయడంలో ఐపిఎల్ చాలా ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కాబట్టి ఐపిఎల్ వంటి లీగ్ ను ప్రారంభించాలన్న  ఆలోచన వచ్చిన బిసిసిఐ ని అభినందించక తప్పదన్నాడు. కేవలం ఆటగాళ్ళలోని టాలెంట్ ను వెలికితీయడమే కాదు...క్లిష్ట సమయాల్లో ఎలా ఆడాలో కూడా ఈ  ఐపిఎల్ నేర్పిస్తోంది. కాబట్టి ప్రపంచ కప్ లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోందని అన్నారు.  పాక్ పై టీమిండియా గెలుపు కూడా ఐపిఎల్ చలవేనని అప్రిది అభిప్రాయపడ్డారు. 

 ఇప్పటివరకు ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇండో పాక్ లు ఏడుసార్లు తలపడగా అన్నిట్లోనూ టీమిండియాదే పైచేయగా నిలిచింది. అయితే ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టును ఓడించిన పాక్ భారత్ ను కూడా ఓడించి చరిత్ర సృష్టించాలనుకుంది. కానీ టీమిండియా ముందు ఆ జట్టు  పప్పులు ఉడకలేవు. మరోసారి పాక్ ను 89 పరుగుల భారీ తేడాతో గెలిచి వరుస విజయాల రికార్డును పదిలం చేసుకుంది.