ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓటమితో అంతా పాకిస్థాన్ పని అయిపోయిందనుకున్నారు. అయితే చిరకాల ప్రత్యర్థి భారత్ పై  ఓడిపోవడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ ఆ తర్వాతే కసితో ఆడటం ఆరంభించింది. అలా దక్షిణాఫ్రికాపై గెలిచి మళ్లీ విజయాలబాట పట్టిన పాక్ న్యూజిలాండ్ వంటి బలమైన జట్టును కూడా మట్టికరిపించి సత్తా చాటింది. ముఖ్యంగా ఈ ప్రపంచ కప్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న న్యూజిలాండ్ పై బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో రాణించి పాక్ ఆటగాళ్లు ఆడిన తీరు అభిమానులనే కాదు విశ్లేషకులను సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా బాబర్ ఆజమ్ సెంచరీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

తాజాగా పాక్ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ కూడా బాబర్ ఆజమ్ ను పొగుడుతూ ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టాడు. ''ఈ మ్యాచ్ కు ముందు రెండు మూడు రోజులుగా బాబర్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో ప్రాక్టీస్ సెషన్లో కూడా పాల్గొనలేదు. కేవలం ముందురోజు మాత్రం అదే జ్వరంతో ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇలా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికి అతడు జట్టు ప్రయోజనాల కోసమే ఆడి అద్భుత సెంచరీని  నమోదు చేసుకున్నాడని వెల్లడించాడు. అతడిలోని అంకితభావం తనను ఎంతగానో ఆకట్టుకుంది''  అని  ప్లవర్ పేర్కొన్నాడు. 

బాబర్ ఇదే ఆటతీరు కొనసాగిసాగిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్థాయికి ఎదగడానికి మరెంతో సమయం పట్టదన్నాడు. కోహ్లీలో కనిపించే పరుగుల దాహం, జట్టుకోసం ఏదైనా చేయాలన్న కసి, ఎట్టిపరిస్థితులనైనా ఎదుర్కోగల ఆత్మవిశ్వాసం ఆజమ్ లోనూ కనిపిస్తాయన్నాడు. అయితే ఫిట్ నెస్ ను కాపాడుకుంటూ కెరీర్ ను జాగ్రత్తగా కొనసాగిస్తే బాబర్ ప్రపంచ క్రికెట్లో ఎన్నో ఘనతలు సాధించగలడని ఫ్లవర్ అభిప్రాయపడ్డాడు.
 
బర్మింగ్ హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను పాక్ కేవలం 237 పరుగులకే పరిమితం  చేసింది. ఆ తర్వాత స్వల్ఫ లక్ష్యఛేదన కోసం బ్యాటింగ్ చేపట్టిన పాక్ బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది.  బాబర్ ఆజమ్ వీరోచిత సెంచరీకి(127 బంతుల్లో 101 పరుగులు నాటౌట్) హరీస్ సోహైల్ (68 పరుగులు) హాప్ సెంచరీ తోడవడంతో అలవోకగా లక్ష్యాన్ని ఛేదించగలిగారు. దీంతో పాక్ సెమీస్ ఆశలను సజీవంగా వుంచుగోగలిగింది.