ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమయ్యింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న దాయాదుల పోరుకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలివుంది. భారత్-పాకిస్తాన్ ల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఇరుదేశాలకు గెలుపే లక్ష్యం. దీంతో ఇండో పాక్ ఆటగాళ్లంతా ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో పాక్ కీలక బ్యాట్ మెన్ బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ కోసం తన  సన్నద్దత ఎలా సాగుతుందో తెలిపాడు. 

ఇండో పాక్ మ్యాచ్ కోసం తానెంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఆజమ్ తెలిపాడు. ఈ మ్యాచ్ లో ముళ్లును ముళ్లుతోనే తీయాలన్న ఫార్ములాను తాను ఉపయోగిస్తున్నట్లు తెలిపాడు. భారత్ అటాకింగ్ బౌలింగ్ ను ఎదుర్కోడానికి తాను కూడా అటాకింగ్ గానే బ్యాటింగ్ చేయాలని భావిస్తున్నానని...అందుకోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ శైలిని అనుసరిస్తానని స్ఫష్టం చేశాడు. 

ఇప్పటికే కోహ్లీ బ్యాటింగ్ శైలిని గురించి పూర్తిగా తెలుసుకున్నానని అతడు తెలిపాడు. గత మ్యాచుల్లో అతడి అద్భుత ఇన్నింగ్సులకు  సంబంధించిన వీడియోలను చూస్తూ సన్నద్దమవుతున్నట్లు బయటపెట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో మరీ ముఖ్యంగా చేజింగ్ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో కోహ్లీ బ్యాటింగ్ ను చూస్తే అర్థమవుతుందన్నాడు. అతడు తన సొంత ప్రయోజనాల కోసం ఎప్పుడూ ఆడలేదని...జట్టు ప్రయోజనాల కోసమే ఆడాడన్నాడు. అందువల్లే కోహ్లీ ఆడిన మ్యాచుల్లో భారత్ గెలుపు శాతం ఎక్కువగా వుందని ఆజమ్ అన్నాడు. 

ఇక అందరు భారత్ బౌలింగ్ విభాగం అద్భుతంగా వుందని... దాన్నెలా ఎదుర్కొంటారని అడుగుతున్నారని గుర్తుచేశాడు. వారందరికి నేను ఇస్తున్న సమాధానమేంటంటే భారత్ కంటే బలమైన బౌలింగ్ విభాగాన్ని కలిగిన ఇంగ్లాండ్ ను వారి సొంతగడ్డపైనే ఓడించాం. కాబట్టి టీమిండియా బౌలర్లను ఎదుర్కోవడం పెద్ద సమస్యేమీ కాదని బాబర్ ధీమా వ్యక్తం చేశాడు.