ప్రపంచ కప్ పై ఎన్నో ఆశలతో ఇంగ్లాండ్ కు చేరుకున్న పాకిస్తాన్ లీగ్ దశలోనే చేతులెత్తేసింది. ఆ జట్టు పడుతూ లేస్తూ ఇక్కడివరకు చేరుకున్న పాక్ సెమీ ఫైనల్ కు మాత్రం చేరలేకపోయింది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో దాదాపు 300 పైచిలుకు పరుగుల తేడాతో విజయం సాధిస్తే పాక్ సెమీస్ చేరే అవకాశాలు వున్నాయి.  అయితే మొదట బ్యాటింగ్ కు దిగిన పాక్ కేవలం 315 పరుగులకే పరిమితమయ్యింది. 

అయితే న్యూజిలాండ్ కంటే మెరుగైన రన్ రేట్ సాధించాలంటే పాక్ కేవలం ఎనిమిది పరుగులకు బంగ్లాను ఆలౌట్ చేయాలి. కానీ బంగ్లాదేశ్ కేవలం 1.5 బంతుల్లోనే వికెట్లేవీ కోల్పోకుండా ఎనిమిది పరుగులు చేసింది. దీంతో పాక్ సెమీస్ అవకాశాలు గళ్లంతవగా న్యూజిలాండ్ ఆ అవకాశాన్ని కొట్టేసింది. 

మొదట బ్యాటింగ్ కు  దిగిన పాక్ కు భారీ స్కోరు అందించేందుకు పాక్ ఆటగాళ్లు ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ చాలా కష్టపడ్డారు. వీరిద్దరు రెండో వికెట్ కు సెంచరీ పైచిలుకు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇమామ్ ప్రపంచ  కప్ లో మొదటి సెంచరీని పూర్తి చేసుకోగా బాబర్ ఆజమ్ ను మాత్రం దురదృష్టం వెంటాడింది. 96  పరుగులు చేసిన అతడు మరో నాలుగు పరుగులు  చేస్తే సెంచరీ సాధిస్తాడనగా సైఫుద్దిన్ బౌలింగ్ లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయి(ఎల్బీడబ్యూ) ఔటయ్యాడు. 

వీరిద్దరు ఔటయిన తర్వాత మిగతా ఆటగాళ్లెవరు రాణించలేకపోయారు. అయితే ఇమాద్‌ వసీం(43), మహ్మద్‌ హఫీజ్‌(27)లు ఫరవాలేదనిపించారు. దీంతో పాక్  నిర్ణీత ఓవర్లలో 9  వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. అయితే లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా 8 పరుగుల వద్ద వుండగా పాక్ అధికారికంగా సెమీస్ అవకాశాలను కోల్పోయింది.