ప్రపంచ  కప్ టోర్నీలో టీమిండియా చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టులోని సమస్యలన్నీ బయటపడుతున్నాయి. ఆటగాళ్ళ ఫిట్ నెస్ సమస్యలు, పిసిబి బోర్డులో లుకలుకలు, సెలక్షన్ కమిటీలో లోపాలు ఇలా అన్ని విషయాలపై చర్చ జరుగుతోంది. ఇక జట్టులోని ఆటగాళ్ల మధ్య కూడా విబేదాలున్నాయని...అది కూడా పాక్ ఓటమికి కారణమంటూ ఇటీవల కొందరు ఆరోపించారు. దీంతో దేశ ప్రతిష్టను వ్యక్తిగతమైన గొడవల కారణంగా దిగజార్చారంంటూ అభిమానులు ఆటగాళ్లపై  తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా పాక్ బౌలర్ వాహబ్ రియాజ్ తన సహచరులకు చేసిన  ఓ సూచన నిజంగానే పాక్ ఆటగాళ్ల మధ్య విబేదాలున్నాయన్న ప్రచారాన్ని నిజం చేసేలా వుంది. 

పాక్ ఆటగాళ్లకు ఒకరితో ఒకరికి సత్సంబంధాలు లేవన్న ప్రచారంపై రియాజ్ స్పందించాడు. ఇది కేవలం అసత్య ప్రచారమేనని నిరూపించాలంటే మనమంతా కలిసి సమిష్టిగా ఆడాల్సిన అవసరం వుందన్నాడు. సమిష్టి కృషితో పాక్ ను మళ్లీ విజయాల బాట పట్టించి సెమీస్ కు చేర్చుదామంటూ రియాజ్ సహచరులకు సూచించాడు. 

'' ఇప్పటివరకు వరకు మన మధ్య ఏవైనా విబేధాలుంటే వాటిని మరిచిపోదాం. అలాగే భారత జట్టు చేతిలో ఓటమిని కూడా మరిచిపోదాం. మనమంతా కలిసికట్టుగా ఆడుతూ ఇకపై తలపడనున్న నాలుగు  మ్యాచుల్లో సత్తా చాటుదాం. ముఖ్యంగా సౌతాఫ్రికాపై విజయం సాధించడం చాలా అవసరం. ఎందుకంటే ఆ మ్యాచ్ మన సెమీస్ అవకాశాలను నిర్దారిస్తుంది. 

పాక్ జట్టు ఆడుతున్న మనమంతా ఒకే కుటుంబం. కాబట్టి అన్నదమ్ముల మాదిరిగా కలిసిమెలిసి వుంటూ దేశ ప్రతిష్టను నిలబెడదాం. ఇకపై జట్టులో మంచి స్నేహపూరిత వాతావరణం వుండేలా చూసుకుందాం.'' అని రియాజ్ సహచర పాక్ ఆటగాళ్లకు సూచించాడు.