ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా జరిగిన ఇండో పాక్ మ్యాచ్ లో భారత్ ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మొదట బౌలింగ్, ఫీల్డింగ్ ఆ తర్వాత బ్యాటింగ్ విభాగాల్లో  విఫలమవడంతో టీమిండియా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. పాక్ చెత్తగా ఆడిందనే కంటే భారత్ అత్యద్భుతంగా ఆడిందని చెప్పడమే సమంజసంగా వుంటుంది. ఇప్పటికే భారత్-పాక్ ల మధ్య ద్వైపాక్షిన సబంధాలు దెబ్బతిని ఉద్రిక్త పరిస్థితులు నెలకొని వున్నాయి. ఇలాంటి  సమయంలో తమ దేశం భారత్ చేతిలో  ఓటమిపాలవ్వడం పాక్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. దీంతో వారు తమ జట్టు ఆటగాళ్లను, వారి కుటుంబ  సభ్యులు, పిసిబి, సెలెక్టర్లు ఇలా క్రికెట్ తో సంబంధమున్న ప్రతిఒక్కరిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. 

పాక్ ఆటగాళ్ల సోషల్ మీడియా  అకౌంట్లలో నేరుగా వారిపైనే అభిమానులు దూషణకు దిగుతున్నారు. ఈ చర్యలతో తీవ్ర మనోవేదన  చెందిన పాక్ బౌలర్ మహ్మద్ అమీర్ ట్విట్టర్ ద్వారా  తన ఆవేధనను బయటపెట్టుకున్నాడు. '' దయచేసి మమ్మల్ని( పాకిస్తాన్ టీ మెంబర్స్) పరుష పదజాలంతో తిట్టడం ఆపండి.  మా ప్రదర్శన  వల్ల మనసు నొచ్చుకోవడం వల్లే మీరు  విమర్శలు  చేస్తున్నారని అర్థమవుతుంది. కానీ  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీ సపోర్ట్ మాకుంటే మళ్ళీ మంచి ప్రదర్శన చేస్తామన్న నమ్మకముంది'' అంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. 

భారత్ తో జరిగిన  ప్రపంచ కప్ లో ఆటగాళ్లు ప్రదర్శించిన అలసత్వం, మ్యాచ్ కు ముందు వారు ఎలా గడిపారన్న  దానిపై తీవ్ర వివాదం చెలరేగుతోంది. కొందరు ఆటగాళ్లు ప్రాక్టీస్ వదిలేసి కుటుంబాలతో గడపడానికే ప్రాధాన్యత  ఇచ్చినట్లు వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా మరికొందరు  ఫిట్  నెస్ పై దృష్టి పెట్టకుండా అజాగ్రత్తగా వ్యవహరించారని ప్రచారం జరుగుతోంది.  వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని భారత్ తో ఓటమికి ఇవే కారణమంటూ అభిమానులు ఆటగాళ్లపై, వారి  ప్రవర్తనపై విమర్శలు చేస్తున్నారు.