ప్రపంచకప్ లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. స్వదేశంలో ఇంగ్లాండ్ వంటి బలమైన జట్టుకు కూడా సాధ్యం కాని  వరుస విజయాలను టీమిండియా నమోదు చేసుకుంది. ఇలా టీమిండియా గెలుపులో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కు దిగే  పాండ్యా మెరుపు వేగంతో బ్యాటింగ్ చేస్తూ జట్టుకు ఉపయోగపడే పరుగులు చేస్తున్నాడు. అయితే అతడు ఓ మోస్తరు పరుగుల వద్దే ఆగిపోతూ భారీ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. 

అయితే పాండ్యా ఆటతీరుపై పాకిస్తాన్‌ మాజీ ఆల్‌రౌండర్‌ అబ్దుల్‌ రజాక్‌ తాజాగా ఆసక్తికరమైన  కాముంట్స్ చేశాడు. గతకొంత కాలంగా పాండ్యా ఆటను తాను నిశితంగా గమనిస్తున్నానని... అతడు కొన్ని రకాల షాట్లు ఆడలేకపోతున్నాడని తెలిపాడు. పాండ్యా కోరితే ఎలాంటి షాట్లు ఆడటంతో అతడు విఫలమవుతున్నాడో తెలిపి...ఆ షాట్లు ఎలా ఆడాలో కూడా నేర్పిస్తానని అన్నాడు. మొత్తంగా కొన్ని రోజుల పాటు పాండ్యాకు కోచింగ్ ఇవ్వడానికి తాను సిద్దంగా వున్నానంటూ రజాక్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

''ఇవాళ(గురువారం వెస్టిండిస్ తో మ్యాచ్ లో) హార్దిక్ పాండ్యా ఆటతీరును చాలా నిశితంగా గమనించాను. అతడి ఆటతీరులో చాలా లోపాలున్నట్లు ఈ సందర్భంగా గమనించాను. ముఖ్యంగా బంతిని  బలంగా బాదే క్రమంలో అతడు  శరీరంపై నియంత్రణ కోల్పోతున్నాడు. అలాగే అతడి  ఫుట్ వర్క్ లో కూడా లోపాలున్నాయి. అతన్ని కొంతకాలంపాటు తనకు అప్పగిస్తే అత్యుత్తమ  ఆల్ రౌండర్ గా  తీర్చిదిద్దుతాను. యూఏఈ  వంటి తటస్థ  వేదికలపై అతడికి కోచింగ్ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దుతాను'' అంటూ రజాక్ ట్వీట్ చేశాడు. 

మరో ట్వీట్ లో '' నేను అతన్ని(పాండ్యాను) అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దుతా. బిసిసిఐ అతడు మెరుగైన ఆలౌ రౌండర్ గా మార్చాలనుకుంటే నేను ఎప్పుడైనా అందుబాటులో వుంటా. థ్యాంక్యూ'' అంటూ రజాక్ పనిలో పనిగా బిసిసిఐ అనుమతిని  కోరాడు. 

అయితే రజాక్ ట్వీట్ పై టీమిండియా అభిమానులు, నెటిజన్లు పలు రకాలుగా  స్పందిస్తున్నారు. కొందరు రజాక్ క్రీడాస్పూర్తితోనే ఈ ప్రతిపాదన చేసి వుంటాడని పేర్కొనగా... మరికొందరు అతడు కావాలనే పాండ్యా ఆటతీరులోని లోపాలను ఎత్తిచూపుతున్నాడని మండిపడ్డారు. అయితే రజాక్ ట్వీట్ పై పాండ్యా, బిసిసిఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.