ప్రపంచ కప్ టోర్నీలో వరుస ఓటములతో సతమతమవుతున్న దక్షిణాఫ్రికా జట్టు బుధవారం టీమిండియాతో తలపడనుంది. ఇప్పటికే ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలోనే కాదు పసికూన బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయిన ఆ జట్టు సొంత అభిమానుల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటోంది. ఇలా తీవ్ర ఒత్తిడితో సతమతమవుతున్న సౌతాఫ్రికాకు భారత మ్యాచ్ కు ముందు మరో షాక్ తగిలింది.

బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తీవ్రంగా గాయపడిన కీలక బౌలర్ లుంగి ఎంగిడి భారత్ తో మ్యాచ్ కు దూరమయ్యాడు. కాలి పిక్కల్లో గాయమైన అతడికి 10రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. దీంతో అతడు భారత్ తో పాట్ మరికొన్ని జట్లతో జరగనున్న మ్యాచుల్లో ఆడటం లేదని సౌతాఫ్రికా మేనేజ్ మెంట్ ప్రకటించింది. 

అయితే ఇదే సమయంలో ఆ జట్టుకు ఓ శుభవార్తను అందుకుంది. గాయం కారణంగా మొదటి రెండు మ్యాచులకు దూరమైన డెల్ స్టెయిన్ తాజాగా నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కాబట్టి ఎంగిడి స్థానాన్ని అతడు భర్తీ చేసే అవకాశాలున్నాయి.  అలాగే మొదటి మ్యాచ్ లో గాయపడి  బంగ్లాతో మ్యాచ్ కు దూరమైన ఓపెనర్ హషీమ్ ఆమ్లా కోలుకున్నాడు. కాబట్టి అతడు కూడా భారత్ తో జరిగే మ్యాచ్ ఆడనున్నాడు. 

ఇలా దక్షిణాఫ్రికా జట్టుకు ఎంగిడి దూరమైన మరో ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టులో చేరనున్నారు. కాబట్టి బుధవారం జరిగే మ్యాచ్ లో టీమిండియాను సమర్థవంతంగా ఎదుర్కొని మొదటి విజయాన్ని అందుకుంటామని కెప్టెన్ డుప్లెసిస్ ధీమా వ్యక్తం చేశాడు.