ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఆడాలన్నది ప్రతి ఆటగాడి కల. కొందరు ఆటగాళ్ళ విషయంలో ఆ కల నెరవేరకుండానే కెరీర్ ముగుస్తుంది. మరికొందరు యువ ఆటగాళ్లకు ఆ అవకాశం చాలా తొందరగా వస్తుంది. అలా 2011 వరల్డ్ కప్ ను సామాన్య ప్రేక్షకుడిలా టీవీల్లో టీమిండియా ఆటను చూసిన ఆ యువకుడే ఇప్పుడు అదే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అతడే ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా.

కేవలం భారత జట్టులో చోటు దక్కితే చాలనుకున్న తనకు ఇలా ప్రపంచ కప్ ఆడే అవకాశం రావడం చాలా ఆనందంగా వుందని హర్దిక్ అన్నాడు. అసలు తనకున్న ఏకైక కోరిక టీమిండియా జట్టులో చోటు దక్కించుకోవడం... ఆ కోరిక చాలారోజుల క్రితమే నెరవేరింది. దీంతో మెళ్లిగా మరో ఆశ కలింగిందన్నాడు. ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకుని ఆ ట్రోపిని తన చేతులతో తాకాలని. అందులో సగం కోరిక నెరవేరిందని పూర్తిగా నెరవేరాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందేనని హార్దిక్ పేర్కొన్నాడు. 

భారత జట్టుకు ప్రపంచ కప్ అందించడానికి తాను ఎంత క్లిష్ట పరిస్థితులయినా ఎదుర్కోడానికి సిద్దమన్నాడు. జూలై 14వ తేదీన వరల్డ్ కప్ ట్రోపీ తన చేతుల్లో వుండాలని కోరుకుంటున్నానని... అదే లక్ష్యంగా తన ఆట సాగుతుందన్నాడు. గత మూడు నాలుగేళ్లుగా ప్రపంచ కప్ జట్టులో చోటు కోసమే ఆడానని...ఇప్పుడు ఆ మెగా టోర్నీలో టీమిండియా గెలుపు కోసం ఆడతానని వెల్లడించాడు. 

2011 లో ధోని సారథ్యంలో భారత్ ప్రపంచ కప్ గెలిచిన రోజును తానెప్పుడు మరిచిపోలేనని గుర్తుచేసుకున్నాడు. అప్పుడు తన స్నేహితులతో కలిసి సంబరాలు చేసుకున్నానని...ధోని విన్నింగ్ షాట్ కొట్టినపుడు రోమాలు నిక్కబొడుచుకున్నాయని తెలిపాడు.ఈ ప్రపంచ కప్ లో టీమిండియాను విజయం వైపు నడిపించడంలో తనవంతు పాత్ర పోషించి ఎందరో భారత అభిమానులు సంబరాలు చేసుకునేలా చేస్తానని హార్దిక్ అన్నాడు.