సొంత గడ్డపై జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచ కప్ ట్రోఫీని మొదటిసారి అందుకుంది. అదే క్రమంలో న్యూజిలాండ్ ను దురదృష్టం  వెంటాడడంతో రెండో సారి కూడా ఫైనల్లో బోల్తా పడింది. లార్డ్స్ వేదికగా  జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో సమఉజ్జీగా నిలిచినప్పటికి కివీస్ ట్రోఫీని  కోల్పోవాల్సి వచ్చింది. మరీ విచిత్రంగా బౌండరీల ఆధారంగా ఆతిథ్య జట్టు చేతిలో ఓటమిపాలై రన్నరన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

సాధారణ అభిమానులే కేవలం ఈ ఐసిసి నిబంధనల వల్ల న్యూజిలాండ్ ఓటమిపాలవడంపై తీవ్ర ఆవేధనతో వున్నారు. అలాంటిది ఆ జట్టు ఆటగాళ్ల పరిస్థితి ఎలా వుంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా తృటిలో ట్రోఫీని కోల్పోయిన తర్వాత కేన్ విలియమ్సన్ మొదటిసారి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా అతడు తన అసహనాన్ని బయటపెట్టాడు. 

ఐసిసి నిబంధనల  వల్లే ఓటమి

అసలు ప్రపంచ కప్ ఫైనల్లో ఎవరూ ఓడిపోలేదు...మరెవరూ విజేతలుగా నిలవలేదని పేర్కొన్నారు. కేవలం ఇంగ్లాండ్ జట్టు ట్రోఫీని మాత్రమే అందుకుంది. మా దురదృష్టం కారణంగా మేము అందుకోలేకపోయాం. అంతే తేడా అని విలియమ్సన్ పేర్కొన్నాడు. 

బౌండరీల ఆధారంగా మీరు ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక ట్రోఫీని కోల్పోవాల్సి రావడంపై మీరెలా స్పందిస్తున్నారని  ఓ మీడియా  ప్రతినిధి విలియమ్సన్ ను ప్రశ్నించారు. అందుకు అతడు కాస్త సెటైరికల్ గా జవాభిచ్చాడు. ''మీరిలా ఈ ప్రశ్న వేయాల్సి వస్తుందని గానీ...నేను అందుకు సమాధానం చెబుతానని గానీ అస్సలు ఊహించలేదు. కానీ ఆ పరిస్థితి వచ్చింది'' అని విలియమ్సన్ ఆవేదన వ్యక్తం చేశాడు.