ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ మెగా టోర్నీ చివరి అంకానికి చేరుకుంది. ఇక మిగిలింది మూడు మ్యాచ్ లు. రెండు సెమీఫైనళ్లు, ఫైనల్ మాత్రమే. లీగ్ దశలో కంటే మరింత ఉత్కంఠభరితంగా సాగనున్న ఈ పోరులో ఓటమంటూ ఎరుగని జట్టే టైటిట్ ను ఎగరేసుకుపోనుంది. అయితే ఈ మెగాటోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతూ టాప్ లో నిలిచిన టీమిండియా సెమీస్ లో న్యూజిలాండ్ తో తలపడనుంది. రేపు(మంగళవారం) మాంచెస్టర్ వేదిక భారత జట్టును ఎదుర్కోవాల్సిన కివీస్ ఇప్పటినుండే మాటల యుద్దం మొదలుపెట్టింది. 

న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టిడ్ ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్ గురించి మీడియాతో మాట్లాడాడు. '' తాము చివరి క్షణంలో కేవలం నెట్ రన్ రేట్ ఆధారంగా సెమీస్ కు అర్హత సాధించాం. కానీ టీమిండియా అలా కాదు. టోర్నీ ఆరంభంనుండి వరుస విజయాలతో పాయింట్స్ టేబుల్ లో అగ్రస్థానంలో నిలిచి మరీ సెమీస్ కు చేరింది. కాబట్టి ఇలా భారీ విజయాలతో సెమీస్ కు చేరిన భారత్ పై భారీ అంచనాలుంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగా ఆడాలన్న ఒత్తిడి భారత ఆటగాళ్లపై వుంటుంది. 

అయితే చివరి నిమిషంలో మేం(కివీస్ జట్టు) సెమీస్ కు చేరాం. అసలు మేం ఇక్కడివరకు వస్తామని కూడా ఎవరూ ఊహించలేదు. కాబట్టి ఈ సెమీస్ లో కూడా మాపై పెద్దగా అంచాలు లేవు. కాబట్టి మా ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడి లేకుండా సెమీస్ మ్యాచ్ ఆడనున్నారు. మా గెలుపుపై మాకే అంచనాలు లేవు కాబట్టి భారత్ పై కివీస్ ఆటగాళ్లు స్వేచ్చగా ఆడతారు. ఇది మాకెంతో ఉపయోగపడే పరిణామం.'' అని గ్యారీ పేర్కొన్నాడు. 

అయితే సెమీఫైనల్ పోరులో భారత్ పై గెలిచి ఫైనల్ కు చేరాలన్న పట్టుదలతో కివీస్ ఆటగాళ్లు వున్నారని గ్యారీ తెలిపాడు. భారత్ వంటి బలమైన బ్యాటింగ్,  బౌలింగ్ లైనప్ కలిగిన జట్టును ఎదుర్కోవడం కష్టమైన పనే అయినప్పటికి అసాధ్యం మాత్రం కాదు. అందులోనూ మాపై అంచనాలు గానీ, ఒత్తిడిగానీ లేదు. కాబట్టి ఆటగాళ్లు స్వేచ్చగా ఆడి జట్టును ఫైనల్ కు చేరుస్తారని నమ్మకంతో వున్నట్లు కివీస్ కోచ్ అభిప్రాయపడ్డాడు.