ప్రపంచ కప్ విజేతగా నిలవడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు చిరకాల కోరిక నెరవేరింది. ఇదే క్రమంలో వరుసగా రెండోసారి వరల్డ్ కప్ ఫైనల్ కు చేరినప్పటికి  న్యూజిలాండ్ ఆశలపై ఐసిసి నిబంధనలపై నీళ్లు చల్లాయి.  ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుని ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. అయితే ఐసిసి నిబంధనల వల్ల అదృష్టం కలిసివచ్చి ఇంగ్లాండ్ ప్రపంచ కప్ ను జయించింది. దీంతో ప్రతిష్టాత్మకమైన ఇలాంటి టోర్నీలో ఐసిసి అనుసరించిన నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా న్యూజిలాండ్ కోచ్ గ్యారీస్టెడ్ కూడా తమ జట్టు ఓటమికి కారణమైన ఐసిసి పై మండిపడ్డాడు. '' దాదాపు నెలన్నర పాటు పది జట్లతో పోరాడి ఇంగ్లాండ్-న్యూజిలాండ్  లు ఫైనల్ కు చేరాయి. ఈ మ్యాచ్ లో ఇరు జట్లు సమానమైన స్కోర్లు సాధించడంతో మ్యాచ్ టై అయ్యింది.  ఆ తర్వాత సూపర్ ఓవర్ లోనూ ఇరుజట్లు సమాన మైన పరుగులు సాధించాయి. కాబట్టి ఈ రెండు జట్లను విజేతలుగా ప్రకటించి వుండాల్సింది. ఆ దిశగా ఐసిసి నిర్ణయముంటే మరింత హుందాగా వుండేది.'' అని గ్యారీ పేర్కొన్నాడు.

ఇక ఇదే అభిప్రాయాన్ని బ్యాటింగ్ కోచ్ మెక్ మిల్లన్ వ్యక్తపర్చాడు. ఇంగ్లాండ్ తో  పాటు న్యూజిలాండ్ జట్టును కూడా ప్రపంచ కప్ విజేతగా ప్రకటిస్తే బావుండేదని అన్నాడు. అలా కాకుండా ఐసిసి బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ జట్టుకు ట్రోఫీ అందించడం కాస్త బాధించింది. అయితే ఆటలో భాగంగా రూపొందించిన నియమ నిబంధనలు పాటించడం అందరి భాద్యత... కాబట్టి మౌనంగా వుండిపోవాల్సి వస్తోందని మెక్ మిల్లన్ తెలిపారు.