ఈ ప్రపంచ కప్ ఆరంభంలో అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుని ఆసాంతం పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ లో నిలిచిన జట్టు న్యూజిలాండ్. అలాంటిది లీగ్ దశ ముగింపు స్థాయికి వచ్చేసరికి సెమీస్ బెర్తు కోసం పోరాడాల్సిన వస్తోంది. మరీముఖ్యంగా ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోవడంతో సెమీస్ అవకాశం కోసం  వేరే మ్యాచ్ ల ఫలితం కోసం వేచిచూడాల్సి వస్తోంది. ఇలా కీలకమైన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలవడం తమనెంతో నిరుత్సాహపర్చిందని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశారు. 

ఈ  మ్యాచ్ ఫలితం తమకు వ్యతిరేకంగా రావడానికి ముఖ్య  కారణం బ్యాట్స్ మెన్ వైఫల్యమేనని అతడు పేర్కొన్నాడు. సెకండాఫ్ లో తాము బ్యాటింగ్ కు దిగే సమయానకి పిచ్ పరిస్థితి పూర్తిగా మారిపోయి బౌలింగ్ కు అనుకూలించిందన్నాడు. అయినా తాము ఆటగాళ్లు కనీస పోరాటపటిమ ప్రదర్శించకుండానే చేతులెత్తేయడం బాధాకరమని అన్నాడు. 

మొదట ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేసే సమయంలో పిచ్  బ్యాటింగ్ కు అనుకూలంగా వుంది. కాబట్టి మా  బౌలర్లను నిందించలేం. అయితే పిచ్ మారుతూ వచ్చిన కొద్ది వారు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలా ఇంగ్లాండ్ మరికొన్ని పరుగులు సాధించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఆరంభంలో ఇంగ్లాండ్ ఓపెనర్లు బెయిర్ స్టో, జేసన్ రాయ్ చాలాబాగా ఆడారని విలియమ్సన్ ప్రశంసించారు.

ఇంగ్లాండ్ ఓపెనర్ల భాగస్వామ్యం మాదిరిగా మేము కనీసం ఒక్క మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పి వుంటే గెలిచేవారమని అన్నాడు. ఏదేమైన బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన తాము పూర్తిస్థాయి శక్తిసామర్ధ్యాలతో ఆడలేకపోయాం. ఇంగ్లాండ్ ను బ్యాటింగే గెలిపించగా తమను అదే బ్యాటింగ్ ఓడించిందని విలియమ్సన్ ఓటమికి  గల కారణాలను వివరించాడు.