స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తమ చిరకాల వాంఛను నెరవేర్చుకుంది. ప్రతిష్టాత్మక లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. అయితే ఫైనల్ పోరులో కివీస్ చివరి వరకు శక్తివంచన  లేకుండా పోరాడినా అదృష్టం కలిసిరాక ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. దీంతో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఆ జట్టు రన్నరప్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 

 తీవ్ర ఉత్కంఠతో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన మ్యాచ్ లో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. మొదట మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో కూడా ఇరుజట్లూ సమానమైన పరుగులు చేశారు. దీంతో చివరకు మ్యాచ్ లో అత్యధిక బౌండరీలు బాదిన జట్టును విజేతగా నిర్ణయించారు. ఇలా ఇంగ్లాండ్ ను అదృష్టం వరించి ప్రపంచ కప్ ట్రోఫీని అందుకోగా....కివీస్ దురదృష్టవశాత్తు ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఓటమి న్యూజిలాండ్ ఆటగాళ్లను తీవ్ర నిరాశకు గురిచేసింది. 

 ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన ఆల్ రౌండర్ జిమ్మీ నీషమ్ ను ఈ ఓటమి మరింత ఆవేదనకు గురిచేసినట్లుంది. దీంతో అతడు క్రికెట్ పై ప్రేమ పెంచుకుంటూ క్రికెటర్లుగా మారాలని కలలుకంటున్న చిన్నారులకు ఓ సలహా ఇచ్చాడు. '' పిల్లలూ...క్రీడల్లోకి మాత్రం మీరు రావద్దు. వంటపని గానీ మరేదైన ప్రొపెషన్ ను ఎంచుకొండి. అలా అయితేనే 60 ఏళ్లకే ఆరోగ్యంగా వుంటూ హ్యాపీగా చనిపోవచ్చు'' అంటూ నీషమ్ ట్విట్టర్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేశాడు.