మహేంద్ర సింగ్ ధోని... గొప్ప క్రికెటరే కాదు అంతకంటే గొప్ప దేశభక్తుడు. అందుకు నిదర్శనమే అతడిని ఇండియన్ ఆర్మీ లెప్టినెంట్ కల్నల్ వంటి ఉన్నత పదవిని ఇచ్చి గౌరవించడం. స్వతహాగా దేశ రక్షణ కోసం అహర్నిషలు పాటుపడే ఆర్మీ అంటే ధోనికి ఎంతో ఇష్టం. క్రికెటర్ కాకుంటే మిలిటిరీలో చేరి మరోరకంగా దేశానికి సేవ చేసేవాడినని అనేక సందర్భాల్లో అతడు వెల్లడించాడు. అయితే అతడు ప్రత్యక్షంగా ఇండియన్ ఆర్మీకి సేవలందించకున్నా వీలు చిక్కిన ప్రతిసారి దాన్ని ప్రమోట్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఇలా బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో కూడా ధోని మరోసారి దేశభక్తిని చాటుకున్నాడు.

సౌతాంప్టన్ వేదికన జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో టీమిండియా సౌతాఫ్రికాతో తలపడిన విషయం తెలిసిందే. ఈ  మ్యాచ్ లో దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ కు దిగగా టీమిండియా ఫీల్డింగ్ చేయాల్సివచ్చింది. ఈ సమయంలో వికెట్ కీపర్ గా ధోని రెగ్యులర్ గ్లవ్స్ తో కాకుండా కాస్త ప్రత్యేకమైన వాటిని వాడారు. అయితే సౌతాఫ్రికా బ్యాట్ మెన్ ఫెహ్లుక్వాయోను  స్టంపౌట్ చేసిన సమయంలో ఈ గ్లవ్స్ ను కెమెరాలు అతి దగ్గరనుండి చూపించడంతో అసలు విషయం బయటపడింది. 

ఆ  గ్లొవ్స్ ఎక్కడో తయారుచేసినవి కావు. ఇండియన్‌ పారామిలటరీ రెజిమెంట్‌తో తయారు చేసిన గ్లోవ్స్‌. వాటిని ధరించి బరిలోకి దిగిన మిస్టర్ దేశరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు  గుర్తుగా ఈ గ్లోవ్స్ వాడినట్లు తెలుస్తోంది. ఇలా అసలు ప్రచారమే లేకుండా మనస్పూర్తిగా అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ ధోని చేసిన పనికి భారత అభిమానులు ఫిదా అయిపోయారు. 

ఇలా మాతృభూమిని కాపాడుతున్న ఆర్మీపై ధోని చూపించిన  గౌరవాన్ని నెటిజన్లు పొగడకుండా వుండలేకపోతున్నారు. ధోనిని తామెందుకు ఇంతలా ప్రేమిస్తామో ఇలాంటి సంఘటనల గురించి తెలిసినపుడు అందరికి అర్థమవుతుందని ధోని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  

గతంలో కూడ పుల్వామా దాడిలో అమరవీరులైన జవాన్లకు నివాళి అర్పిస్తూ ఇండియన్ ఆర్మీ క్యాప్ లు ధరించి భారత జట్టు బరిలోకి దిగింది.  ఆస్ట్రేలియాపై జరిగిన ఈ మ్యాచ్ లో ధోనినే స్వయంగా ఆర్మీ క్యాప్ లను జట్టు సభ్యులందరికి అందించాడు. అప్పుడే  అతడి పేరు మారుమోగింది. మరోసారి ఇప్పడు ఇండియన్ ఆర్మీ తయారుచేసిన గ్లోవ్స్ వాడటం ద్వారా మరోసారి ధోని దేశభక్తిని చాటుకున్నాడు.