ఆస్ట్రేలియా, పాకిస్థాన్, సౌతాఫ్రికా వంటి  బలమైన జట్లను అవలీలగా ఓడించిన భారత జట్టు అప్ఘాన్ పై మాత్రం చెమటోడ్చి విజయాన్ని అందుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జైత్రయాత్రకు అప్ఘాన్ దాదాపు అడ్డుకున్నంత పని చేసింది. చివరి వరకు గెలుపు  కోసం పోరాడిన అప్ఘాన్ కేవలం 11 పరుగుల తేడాతో ఓటమిపాలవ్వాల్సి వచ్చింది.  ఇలా ఉత్కంఠభరితంగా సాగిన భారత్-అప్ఘాన్  మ్యాచ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందించారు. 

తీవ్ర ఒత్తిడిలోనూ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి నిర్ణయాలు తీసుకుని ఫలితాన్ని రాబట్టాడని సచిన్ పేర్కొన్నారు. మునుపటికంటే ఈ మ్యాచ్ లోయ కోహ్లీ ఆలోచనా విధానంలో పరిణతి కనిపించిందన్నారు. కీలక సమయంలో హార్దిక్ పాండ్యా చేత బౌలింగ్ చేయించడం, బుమ్రా, షమీలను సమర్థవంతంగా ఉపయోగించుకున్న కోహ్లీ నిర్ణయాల వల్లే ఈ మ్యాచ్ లో భారత్ విజయాన్ని అందుకుందని  తెలిపారు. కెప్టెన్ నమ్మకాన్ని బౌలర్లు కూడా నిలబెట్టారన్నారు. అలాగే  బ్యాటింగ్ లోనూ కోహ్లీ (67 పరుగులు) హాఫ్ సెంచరీతో రాణించడం కేడా టీమిండియా  కు ఎంతగానో  ఉపయోగపడిందంటూ కోహ్లీపై  సచిన్ ప్రశంసలు కురిపించారు. 

ఇదే  సమయంలో మహేంద్ర సింగ్ ధోని  బ్యాటింగ్ పై సచిన్ విమర్శలు చేశారు. చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించాల్సిన సమయంలో ధోని బ్యాటింగ్ చాలా చప్పగా సాగిందన్నాడు. ముఖ్మంగా కేదార్ జాదవ్ తో కలిసి అతడు నెలకొల్పిన భాగస్వామ్యం జట్టుకు ఏమాత్రం ఉపయోగపడలేదన్నాడు.  వారిద్దరి బ్యాటింగ్ సామాన్య అభిమానులకు విసుగు తెప్పించేలా సాగిందని సచిన్ విమర్శించారు. 

అప్ఘాన్ ఆటగాళ్లను కూడా ప్రశంసించకుండా వుండలేకపోతున్నానని సచిన్ అన్నాడు. వారు బలమైన  బ్యాటింగ్, బౌలింగ్ కలిగిన భారత్ పై అత్యద్భుతంగా ఆడారన్నారు. ఆ జట్టులో నాణ్యమైన బౌలర్లు, బ్యాట్ మెన్స్ వున్నారని...అందువల్లే అంతర్జాతీయ స్థాయిలో టాప్ జట్లను కూడా అప్ఘాన్ సవాల్ చేస్తోందని సచిన్ వెల్లడించారు.