ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగి అదే తరహా ఆటతీరును కనబరుస్తోందని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమిండియా అన్ని బలమైన జట్లనే మట్టికరిపించి సత్తా చాటిందన్నారు. మరీ ముఖ్యంగా దాయాది పాకిస్థాన్ తో అత్యధ్బుతంగా ఆడి చిరస్మరణీయ విజయాన్ని అందుకుందని  కొనియాడారు. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ సత్తా చాటి జట్టు తానేంటో నిరూపించుకుందన్నారు. ఇక తర్వాతి మ్యాచ్ లో బరిలోకి దిగనున్న బౌలర్ మహ్మద్ షమీ తానేంటో నిరూపించుకోవాలని సచిన్ సూచించారు. 

పాక్ తో జరిగిన  మ్యాచ్ లో బౌలర్  భువనేశ్వర్ కుమార్ కు గాయమైన విషయం తెలిసిందే.  భువీ గాయంనుండి (తొడ కండరాలు పట్టేయడంతో) ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా తదుపరి ఆడే రెండు మ్యాచులకు దూరమయ్యాడు. దీంతో ఈ  టోర్నీ ఆరంభంనుండి పెవిలియన్ కే పరిమితమైన అతడు తర్వాత   బంగ్లాతో జరిగే మ్యాచ్ ఆడనున్నాడు. 

అయితే షమీకి ప్రపంచ కప్ బరిలో దిగే అవకాశం రావడం తనకు చాలా సంతోషాన్నిచ్చిందని సచిన్ పేర్కొన్నారు. గత  ప్రపంచ కప్ లో మాదిరిగా ఇందులో కూడా అతడి అత్యుత్తమ ప్రదర్శను  మనం చూస్తామన్న నమ్మకం వుందన్నారు. అతడు విజృంభిస్తే ప్రత్యర్థులకు ఇబ్బందులు తప్పవన్నారు. వచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకుంటాడని భావిస్తున్నట్లు సచిన్ వెల్లడించారు.