ప్రపంచ కప్ టోర్నీలో లీగ్ దశనుండి అదరగొట్టిన భారత్ చివరకు సెమీఫైనల్ నుండే వెనుదిరగాల్సి వచ్చింది. మాంచెస్టర్ వేదికన న్యూజిలాండ్ తో తలపడ్డ భారత్ 18పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. ఇలా భారత్ టోర్నీనుండి నిష్క్రమించినప్పటికి ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన రవీంద్ర జడేజా(77 పరుగులు), ధోని(50 పరుగులు) లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇలా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ధోనిపై ప్రశంసలు కురిపించాడు.

న్యూజిలాండ్ తో జరిగిన  సేమీ ఫైనల్లో అభిమానులు ధోని వున్నతంసేపు భారత్ దే గెలుపన్న నమ్మకంతో వున్నారని సచిన్ పేర్కొన్నారు. అభిమానుల నమ్మకానికి తగ్గట్లుగానే  అతడి ఆటతీరు సాగిందని తెలిపారు. అతడు క్రీజులో వున్నంతసేపు ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా ఆడాడు. డెత్ ఓవర్లలో కూడా ఇంత కూల్ గా ఆడటం అతడికే చెల్లింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా జడేజా కలిసి అతడు నెలకొల్పిన సెంచరీ భాగస్వామ్యం టీమిండియా గెలుపుపై ఆశలు రేకెత్తించింది. 

ధోని వున్నంతసేపు  భారత్ గెలుపుపై అభిమానులు ఎలాంటి అనుమానం లేదని...సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా అతడు వున్నాడన్న ధీమాతోనే అభిమానులు వున్నారు. కానీ అనూహ్యంగా ధోని రనౌటవడంతో మ్యాచ్ పూర్తిగా కివీస్ చేతుల్లోకి వెళ్లిపోయిందని సచిన్ పేర్కొన్నాడు. 

ఇక ధొని రిటైర్మెంట్ పై కూడా సచిన్ స్పందించాడు. ఎప్పటివరకు ఆడాలన్నది ధోని వ్యక్తిగత అంశమని...అందువల్ల దానిపై నిర్ణయం తీసుకునే స్వేచ్చ అతడికే వుందన్నారు. ఇందులో ఎవరు జోక్యం చేసుకోకూడదని  సచిన్ సూచించాడు.  తన రిటైర్మెంట్‌ పై ధోనియే స్వయంగా ప్రకటిస్తాడని... అప్పటి వరకు అందరూ వేచిచూడాల్సిందేనని సచిన్‌  పేర్కొన్నాడు.