టీమిండియా సీనియర్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోని కూడా రిటైర్మెంట్ కు సిద్దమయ్యాడు. ఈ ప్రపంచ కప్ లో టీమిండియా ఆడే మ్యాచే అతడికి చివరి మ్యాచ్ కానుంది. ఈ మేరకు ధోని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

ఈ ప్రపంచ కప్ లో పేలవమైన ఆటతీరుతో ధోని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం  తెలిసిందే. గతంలో మాదిరిగా అతడు  దాటిగా ఆడలేకపోతున్నాడు. ధోని నుండి భారీ  ఇన్నింగ్సులను ఆశిస్తున్న అభిమానులు ఈ ఆటతీరుతో విసుగుచెందిపోయి విమర్శలకు దిగారు. అంతేకాదు టీమిండియా మాజీలు కూడా ధోని ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికు మాస్టర్ బ్లాస్టర్ సచిన్, మాజీ కెప్టెన్ గంగూలీ, సంసయ్ మంజ్రేకర్ లు ధోని స్లో బ్యాటింగ్ పై బహిరంగంగానే విమర్శలు చేశారు. 

అలాగే అతడి కీపింగ్ లోనూ పస తగ్గిందని మండిపడుతున్నవారు కూడా ఎక్కువయ్యారు. ఈ విమర్శల నేపథ్యంలోనే ధోని క్రికెట్ కుగుడ్ బై చెప్పాలని భావిస్తున్నట్లు  తెలుస్తోంది.  అందుకోసం ఈ ప్రపంచ కప్ టోర్నీనే మంచి  వేదిక అని ధోని బావిస్తున్నాడట. అందువల్ల ఇంగ్లాండ్ లోనే  ధోని రిటైరయ్యే అవకాశాలున్నాయని అతడి సన్నిహితులు చెబుతున్నారు. 

ఈ ప్రపంచ కప్ లో అద్భుతంగా ఆడుతున్న టీమిండియా  తప్పకుండా ఫైనల్ కు చేరుతుందన్న  అంచనాలున్నాయి. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ లోనే ధోనికి వీడ్కోలు పలికే కార్యక్రమం జరగనుంది. రెండో ప్రపంచకప్ సాధించిన ఆనందంలోనే రిటైరవ్వాలన్నది ధోని ఆలోచనగా కనిపిస్తోంది.