దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ కప్ సీజన్ 12లో చెత్త ఆటతీరును కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లాండ్ లో ఈ టోర్నీ ఆరంభానికి ముందు సఫారీ టీం కూడా హాట్ ఫేవరెట్ జట్లలో ఒకటి.  అయితే బంగ్లాదేశ్ చేతిలో ఓడినప్పుడే ఆ జట్టు వాస్తవ బలం అందరికి అర్థమయ్యింది. అయితే ఆ జట్టు మేనేజ్ మెంట్ డివిలియర్స్ వంటి ఓ అత్యుత్తమ ఆటగాడి సేవలను తిరస్కరించి తప్పు చేసిందని క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అలాంటి అనాలోచిత నిర్ణయాలే ప్రస్తుతం సఫారి జట్టు ఓటమికి కారణమని వారు ఆరోపిస్తున్నారు.  

ఇలా ఇప్పటికే తీవ్ర ఒత్తిడిలో వున్న తమపై డివిలియర్స్ వివాదం మరింత ఒత్తిడిని పెంచుతుండటంతో కెప్టెన్ డుప్లెసిస్ ఈ వ్యవహారంపై స్పందించాడు. డివిలియర్స్ చాలా ఆలస్యంగా తన నిర్ణయాన్ని తెలియడం వల్లే అతడి పునరాగమనాన్ని వ్యతిరేకించాల్సి వచ్చిందన్నాడు. లేదంటే అతడిని అభ్యర్థనను బోర్డు కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకుని సానుకూల నిర్ణయాన్ని తీసుకునేదని డుప్లెసిస్ తెలిపాడు. 

ప్రపంచ కప్ జట్టు ప్రకటించడానికి ముందు రోజే డివిలియర్స్ తనకు ఫోన్ చేశాడని డుప్లెసిస్ తెలిపాడు. తాను మళ్లీ సఫారీ జట్టు తరపున ప్రపంచ కప్ ఆడాలనుకుంటున్నాని అన్నాడు. అయితే ఈ నిర్ణయం జట్టుకు  ప్రయోజనాన్ని చేకూర్చేదే. అయితే నిర్ణయం తీసుకోవడంలో అతడు ఆలస్యం చేశాడు. అదే  విషయాన్ని అతడికి చెప్పినట్లు డుప్లెసిస్ పేర్కొన్నాడు.    

 తాను ప్రాతినిధ్యం వహించిన సఫారీ జట్టు వరుస ఓటములతో సతమతమవుతున్న సమయంలో మాజీ ప్లేయర్ ఏబి డివిలియర్స్ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. తనను తిరిగి జట్టులోకి తీసుకోవాలని కోరితే మా బోర్డు ఒప్పుకోలేదని డివిలియర్స్ తెలిపాడు. దీంతో అభిమానులు డివిలియర్స్ పునరాగమనాన్ని వ్యతిరేకించిన దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు, సెలెక్షన్ కమిటీపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే  ఈ విషయంలో డివిలియర్స్ దే తప్పని  తాజాగా డుప్లెసిస్ అభిప్రాయపడ్డాడు.