ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రసవత్తర పోరులో టీమిండియాదే పైచేయిగా నిలిచింది. ఇలా ఓ వైపు ఆసిస్ పై విజయం ఆనందం కలిగించినా మరోవైపు శిఖర్ ధవన్ గాయం టీమిండియాను దెబ్బతీసింది. ఈ మ్యాచ్ లో సెంచరీ చేసి మంచి ఫామ్ లోకి వచ్చినప్పటికి బొటనవేలి గాయం కారణంగా అతడు దాదాపు 10-15 రోజులు ప్రపంచకప్ కు దూరమవ్వాల్సి వచ్చింది.

అయితే ఇలా ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ కు  అర్థాంతరంగా దూరమవడంతో ధవన్ లో  మరింత కసి పెరిగింది. ఈ విషయం ఇటీవల అతడి ట్వీట్లను బట్టి తెలుస్తోంది. అతడిలో మళ్లీ తిరిగి జట్టులోకి రావాలన్న కోరిక ఎంత బలంగా వుందో ఈ మెసేజ్ లను బట్టి తెలుస్తోంది. అయితే ధవన్ కేవలం ట్వీట్లకే పరిమితం కాకుండా తీవ్ర గాయంతో బాధపడుతూనే ఫిట్ నెస్ ను కాపాడుకునే ప్రయత్నం  చేస్తున్నాడు. 

గాయమైన చేతికి కట్టుకుని మరీ ధవన్ జిమ్ లో తెగ కసరత్తు చేస్తున్నాడు. ఇలా జిమ్ లో వివిధ రకాల కసరత్తులు చేస్తున్న వీడియోను తాజాగా అతడు తన అధికాకిక  ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోకు ఓ కామెంట్ యాడ్ చేశాడు. '' ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఓ పీడకలలా మరిచిపోవాలి. దాన్నే ఓ అవకాశంగా మలుచుకుని రెట్టించిన ఉత్సహంతో  ఓ బౌన్సర్ మాదిరిగా తిరిగిరావాలి.  నేను తొందరగా కోలుకోవాలని మెసేజ్ లు చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు'' అంటూ ధవన్ పేర్కొన్నారు.  

ధవన్ గాయం  కారణంగా  దాదాపు నాలుగు మ్యాచ్( న్యూజిలాండ్, పాకిస్థాన్, అప్ఘాన్, వెస్టిండిస్) లకు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమిండియా  బ్యాటింగ్ కోచ్ సంజయ బంగర్ వెల్లడించాడు. ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరిగే మ్యాచ్ కు ధవన్ అందుబాటులోకి వస్తాడన్న నమ్మకం వుందని పేర్కొన్నాడు. అంతవరకు రిషబ్ పంత్ జట్టులో చేరకున్నా జట్టులో పాటే ఇంగ్లాండ్ లో వుంటాడని  తెలిపారు.  అత్యవసరమైతే అతన్ని వాడుకుంటామని సంజయ్ స్పష్టం చేశాడు.