ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. అప్ఘానిస్థాన్ పై సాధించిన గెలుపుతో టీమిండియా  హాఫ్ సెంచరీ విజయాల మైలురాయిని అందుకుంది. ఐసిసి వన్డే ప్రపంచ కప్ టోర్నీని ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు భారత జట్టు 50 విజయాలను నమోదుచేసుకుందన్నమాట. ఇలా ఈ మైలురాయిని అందుకున్న మూడో అంతర్జాతీయ జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. 

ఇంతకుముందు కేవలం రెండు జట్లు మాత్రమే ప్రపంచ కప్ లో 50కి పైగా విజయాలను అందుకున్నాయి. ఆస్ట్రేలియా జట్టు గత ప్రపంచ కప్ లోనే ఈ  ఘనత సాధించగా( 67 విజయాలతో) న్యూజిలాండ్ ఈ టోర్నీలోనే రెండో స్థానానికి (52 విజయాలతో) చేరింది. తాజాగా టీమిండియా కూడా అప్ఘాన్ పై గెలిచి 50వ ప్రపంచ కప్ విజయాన్ని నమోదు చేసుకుంది.  

ఇలా ఓ తీపి జ్ఞాపకాన్ని అందించిన అప్ఘాన్ మ్యాచే మరో చేదు జ్ఞాపకాన్ని కూడా మిగిల్చింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 11 పరుగులతో తేడాతో గెలిచిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ కప్ లో ఇంత తక్కువ పరుగుల తేడాతో భారత జట్టు గెలవడం ఇదే మొదటిసారి. గతంలో న్యూజిలాండ్ పై 16 పరుగుల తేడాతొ గెలవడమే ఇప్పటివరకు రికార్డు. అప్ఘాన్ మ్యాచ్ లో అంతకంటే తక్కువ పరుగుల తేడాతో భారత జట్టు ఓడిపోయి మరో రికార్డు సృష్టించింది.