పాకిస్థాన్ పై మరో  ప్రపంచ కప్ విజయాన్ని అందుకున్న టీమిండియాపై  ప్రశంసల జల్లు కురుస్తోంది. గెలుపు  ధీమాతో ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన పాక్ ను భారత్ ఏకంగా 89 పరుగుల భారీ తేడాతో ఓడించింది. దీంతో భారత అభిమానులు, మాజీ క్రికెటర్లు, విశ్లేషకులతో పాటు విదేశీ అభిమానులు కూడా భారత జట్టు సమిష్టి పోరాటాన్ని పొగడకుండా వుండలేకపోతున్నారు. ఇలా టీమిండియా చేతిలో ఓటమిపాలైన పాకిస్థాన్ కు చెందిన కొందరు మాజీలు కూడా భారత జట్టును ప్రశంసిస్తున్నారు. అలా దిగ్గజ క్రికెటర్ వకార్ యూనిస్ కూడా సొంత జట్టును సున్నితంగా వివర్శిస్తూనే భారత్  పై ప్రశంసలు కురిపించారు. 

గతంతో తాము చూసిన భారత జట్టు కంటే ప్రస్తుతమున్న టీం మరింత బలంగా వుందని వకార్ పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా ప్రపంచ కప్ జట్టు  అత్యుత్తమ బ్యాటింగ్ మరియు బౌలింగ్ విభాగాన్ని కలిగి సమతూకంతో వుందన్నారు. ప్రత్యర్థి జట్లు కోహ్లీ సేనను చూసి భయపడుతున్నాయంటేనే టీమిండియా ఎంత  బలంగా వుందో అర్థం చేసుకోవచ్చని వకార్ వెల్లడించారు. 

ఇక ఈ భారత జట్టుకు, పాక్ జట్టుకు అసలు ఏమాత్రం పోలిక లేదన్నారు. తమ ఆటగాళ్లు ఒత్తిడిని తట్టుకుని ఆడటంలో విఫలమవుతున్నారని...భారత్ ను చూసి ఆ విషయం  నేర్చుకోవాలని సూచించారు. అలాగే ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టిగా రాణించలేకపోవడం కూడా పాక్  సమస్యల్లో  ఒకటన్నారు. ఈ  విషయంలో కూడా భారత్  ను ఫాలో అయితే మంచిదని వకార్ తమ ఆటగాళ్లకు సూచించారు. 

1990లలో తాము ఆడుతున్న సమయంలో  భారత్,  పాకిస్థాన్ సమవుజ్జీలుగా వుండేవన్నారు. కానీ ఆ తర్వాత కాలంలో చాలా మార్పులు చోటుచచేసుకున్నాయని... ఇందులో భాగంగా పాక్ క్రికెట్ నాణ్యత దిగజారిపోగా...భారత్ ది అమాంతం  పెరిగిపోయిందన్నారు. దీంతో ప్రస్తుతం భారత్ తో పాక్ ను పోల్చలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇప్పుడున్న ఇండియన్ టీం ను చూసి పాక్ ఆటగాళ్లు బెంబేలెత్తిపోతున్నారని...  ఆ భయాన్ని  వీడి ఒత్తిడిని తట్టుకోగలిగినపుడే మళ్లీ పాక్ పూర్వవైభవాన్ని  సంతరించుకుంటుందని వకార్ పేర్కొన్నారు. 

ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ వేదికగా దాయాది దేశాల మధ్య జరిగిన ప్రతిష్టాత్మక పోరులో భారత్ ఘన విజయాన్ని సాధించింది. పాకిస్తాన్ జట్టుపై అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో రాణించిన టీమిండియా ఏకంగా 89 పరుగుల తేడాతో  పాక్ ను చిత్తుగా ఓడించింది. మాంచెస్టర్ లో జరిగిన ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా మరోసారి సత్తా చాటి ప్రపంచ కప్ లో పాక్ పై ఏడో విజయాన్ని నమోదుచేసి చరిత్ర సృష్టించింది.