అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ వికెట్ కీపర్ ఎవరంటే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు మహేంద్ర సింగ్ ధోని. అతడు  వికెట్ల వెనకాల ఎంత చురుగ్గా వుంటాడో చాలా సందర్భాల్లో మనందరం చూశాం. ఏ చిన్న అవకాశం చిక్కినా మెరుపు వేగంతో స్టంపౌట్ చేయడం, అసాధ్యమైన క్యాచ్ లను అందుకోవడంలో ధోని తర్వాతే ఎవరైనా. ఇలా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ లోనూ ధోని వికెట్ కీపింగ్ మాయ కొనసాగుతోంది. 

ఇటీవల వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ధోని అద్భుతమైన క్యాచ్ ను అందుకున్నాడు. విండీస్ ఆటగాడు బ్రాత్ వైట్ బ్యాటింగ్ చేస్తూ బుమ్రా విసిరిన బంతిని డిఫెన్స్ ఆడబోయాడు. అదికాదు బ్యాట్ అంచులను తాకుకుంటూ స్లిప్ లో కీపర్ కు చాలా దూరం నుండి వెళుతోంది. అయితే ధోని అమాంతం డైవ్ చేస్తూనే ఒంటి చేత్తో క్యాచ్ ను అందుకున్నాడు. ఇలా ధోని పట్టిన క్యాచ్ ఆ మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది. 

అయితే న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ వికెట్ కీపర్, కెప్టెన్ సర్ఫరాజ్ కూడా అలాంటి  క్యాచ్ నే అందుకున్నాడు. కివీస్ ఆటగాడు టేలర్ క్యాచ్ ను కూడా సర్ఫరాజ్ ఇలాగే డైవ్ చేస్తూ ఒంటిచేత్తో బంతిని ఒడిసి పట్టుకున్నాడు. 

దీంతో ధోని, సర్ఫరాజ్ అందుకున్న ఈ క్యాచులపై ఐసిసి ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేసింది. వీరిద్దరు క్యాచ్ లు అందుకున్న వీడియోలను పక్కపక్కనే పెట్టి ఈ రెండింటిని పోల్చింది. ధోని, సర్ఫరాజ్ లలో ఎవరు ఎవరు బెస్ట్..? అంటూ అభిమానులను ప్రశ్నించింది. 

ఐసిసి ట్వీట్ పై ఇండియా, పాకిస్థాన్ కు చెందిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. తమ ఆటగాడే బెటరంటూ ఎవరి వికెట్ కీపర్ ను వారు సపోర్ట్ చేసుకుంటున్నారు. అయితే కొందరు ఇతర దేశాలకు చెందిన అభిమానులు మాత్రం ధోనినే అత్యుత్తమ వికెట్ కీపర్ అంటూ ప్రశంసిస్తున్నారు. కేవలం ఒకే ఒక క్యాచ్ తో సర్ఫరాజ్ ను ధోనితో పోల్చడం విడ్డూరంగా వుందని భారతీయ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.