ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా జోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మెగాటోర్నీలో రెచ్చిపోతూ తన కెరీర్లో గుర్తుండిపోయే అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తున్నాడు. కేవలం ఎనిమిది మ్యాచుల్లోనే ఐదు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో ఏకంగా 647 పరుగులు బాది టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇలా అత్యుత్తమ ఆటతీరుతో ఆకట్టుకున్న రోహిత్ మూలంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో టాప్ ర్యాంక్ ర్యాంకును కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాడు. 

ఐసిసి తాజాగా ప్రకటించిన  అంతర్జాతీయ వన్డే ర్యాకింగ్స్ లో రోహిత్ శర్మ అనూహ్యంగా రెండో స్థానానికి ఎగబాకాడు. అయితే  కోహ్లీ 891 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా రోహిత్ 885 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇలా టీమిండియా కెప్టెన్  టాప్ ర్యాంకింగ్ కు వైస్ కెప్టెన్ కేవలం ఆరు పాయింట్ల దూరంలో నిలిచాడు. రోహిత్ జోరు ఇలాగే కొనసాగితే కోహ్లీని అధిగమించి టాప్ కు చేరుకోడానికి మరెంతో సమయం పట్టదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

ఈ  ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు కోహ్లీ 63.14 సగటుతో 442 పరుగులు చేశాడు. దీంతో అతడు ఓ పాయింట్ ను సాధించి 891 వద్ద నిలిచాడు. కానీ  రోహిత్ ఐదు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీతో అదరగొట్టడంతో ఏకంగా 51 పాయింట్స్ మెరుగుపర్చుకుని రెండో స్థానాన్ని ఆక్రమించాడు. ఇలా రోహిత్ తన కెరీర్లోనే అత్యధిక పాయింట్లు(885) సాధించాడు.    

ఇక టీమిండియాకు చెందిన జస్ప్రీత్ సింగ్ బుమ్రా వన్డే బౌలర్ల ర్యాకింగ్స్ లో టాప్ లో నిలిచాడు.  అతడు ఈ  ప్రపంచ కప్ లో ఇప్పటివరకు 17 వికెట్లు పడగొట్టడం  ద్వారా ఏకంగా 35 పాయింట్లు మెరుగుపర్చుకున్నాడు. దీంతో అతడు 814 పాయింట్లతో ఎవరికీ అందనంత దూరంంలో వున్నాడు. బుమ్రా తర్వాత  రెండో స్థానంలో వున్న ట్రెంట్  బౌల్ట్ 758 పాయింట్లతో కొనసాగుతున్నాడు. ఇలా వీరిద్దరి మధ్య 56 పాయింట్ల  తేడా వుంది. ఇక ఆసీస్‌ బౌలర్ పాట్‌ కమిన్స్‌(698) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.