ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసిసి ప్రపంచ కప్ లో ఇప్పటివరకు చాలా మ్యాచ్ లు జరిగాయి. ఇకపై మరెన్నో మ్యాచ్ లు జరగనున్నాయి. కానీ దాయాదుల మధ్య జరిగే పోరు వీటన్నింటిలో హైలైట్ గా నిలవనుంది. ఈ ఆదివారం(జూన్ 16న) జరిగే భారత్ -పాకిస్థాన్ మ్యాచ్ కు ఇప్పటికే చాలా హైప్ క్రియేటయ్యింది.  ఇరు దేశాలకు చెందిన అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలా అభిమానుల్లో  నెలకొన్న అంచనాలను టీవి ఛానల్స్ సొమ్ము చేసుకోడానికి ప్రయత్నిస్తూ వివాదానికి కారణమవుతున్నాయి. ఇలాంటి యాడ్స్ పై తాజాగా హైదరబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అసహనం వ్యక్తం చేశారు. 

'' నిజంగా చెబుతున్నా... ఇరు దేశాలకు చెందిన యాడ్స్(ఇండో పాక్ మ్యాచ్ పై) చాలా అసహనానికి గురిచేస్తున్నాయి. ఆ మ్యాచ్ కు మీరు ప్రత్యేకంగా హైప్ క్రియేట్ చేసి మార్కెట్ చేయాల్సిన అవసరం లేదు. అదీ ఇంత చెత్తగా. ఇప్పటికే అభిమానులు ఈ మ్యాచ్ పై ఆసక్తితో వున్నారు. దేవుడి అనుగ్రహంతో ఇది క్రికెట్లో మాత్రమే సాధ్యం. ఇంతకంటే ఇంకా మీరేమీ ప్రచారం చేయలేరు. కాబట్టి స్వీయ నియంత్రణను పాటించడం మంచిది'' అంటూ సానియా ట్వీట్ చేశారు. 

 విచిత్రమైన యాడ్స్ తో ఇరుదేశాల మధ్య మరింత విద్వేషాలు రెచ్చగొడుతున్న టీవి ఛానల్స్ ని ఉద్దేశిస్తూ సానియా ఈ ట్వీట్ చేశారు. ఇలాంటి యాడ్స్ రూపొందించే సమయంలో స్వీయ నియంత్రణ అవసరమన్నది ఆమె ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. అంతేకాదు ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచవ్యాప్తంగా వున్న క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తున్నారని...కాబట్టి ప్రత్యేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం లేదన్నది హైదరబాదీ టెన్నిస్ స్టార్ సానియా అభిప్రాయంగా కనిపిస్తోంది.