ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా శనివారం(రేపు) అప్ఘానిస్తాన్ తో తలపడనుంది. అయితే భారత ఆటగాళ్లు ఈ  మ్యాచ్ ను తేలిగ్గా తీసుకోకుండా పెద్ద జట్లతో మ్యాచ్ సందర్భంగా ఎలా సాధన చేస్తారో అలాగే కష్టపడుతున్నారు. ఇలా భారత ఆటగాళ్లు చూపిస్తున్న అంకితభావంపై సీనియర్ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ ప్రశంసలు కురిపించాడు. అయితే కేవలం ఇలా కష్టపడటం మాత్రమే కాదని...మైదానంలో కూడా ఆ జట్టును తేలిగ్గా  తీసుకోవద్దని సూచించాడు. అలాగే గత మ్యాచుల్లో ఆడిన జట్టునే  కొనసాగించాలంటూ మేనేజ్ మెంట్ కు సలహా ఇచ్చాడు.  

అంతేకాదు నాలుగో స్థానంలో గత మ్యాచ్ లో మాదిరిగానే విజయ్ శంకర్ నే బ్యాటింగ్ కు దించాలని బజ్జీ సలహా  ఇచ్చాడు. ఆ స్థానానికి రిషబ్ పంత్ కంటే శంకరే న్యాయం చేయగలడని...అందువల్ల అతడినే కొనసాగించాలన్నాడు. అలా కాదు అప్ఘాన్ చిన్న జట్టే కదా అని ప్రయోగాలు చేయాలని టీమిండియా మేనేజ్ మెంట్ బావిస్తుంటే దాన్ని విరమించుకోవాలని సూచించాడు. అయితే తుది జట్టులో ఎవరిని ఆడించాలన్న దానిపై ఇప్పటికే టీమిండియా ఒక స్పష్టతకు వచ్చి వుంటుందని బజ్జీ తెలిపారు. 

గత మ్యాచ్ లో విజయ్ శంకర్ బాగా ఆడాడని....కాస్త కుదురుకోనిస్తే అతడి  నుండి మరింత  మంచి ఫలితాన్ని రాబట్టవచ్చని పేర్కొన్నాడు. తాను  మటుకు అప్ఘాన్ తో మ్యాచ్ లో విజయ్ శంకరే ఆడాలని గట్టిగా కోరుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. అలాగని రిషబ్ పంత్ ని వ్యతిరేకించడం లేదని మొదటి  ప్రాధాన్యత  మాత్రమే శంకర్ కు ఇస్తానంటూ హర్భజన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.