ఈసారి వన్డే ప్రపంచ కప్ ను ఐసిసి ఇంగ్లాండ్ వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే దాదాపు లీగ్ దశ ముగింపుదశకు చేరుకున్నప్పటికి సెమీఫైనల్ ఆడే జట్లేవో ఇంకా ఖరారు కాలేదు. దీన్ని బట్టే ఈ టోర్నీ ఎంత రసవత్తరంగా  కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక నిన్న(ఆదివారం) భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మరింత రసవత్తరంగా జరిగింది. ఈ  మ్యాచ్ పై ముందే భారీ అంచనాలు ఏర్పడటంతో అభిమానులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెగ ఆసక్తి చూపించారు. స్వతహాగా క్రికెట్ ప్రియుడైన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ని కూడా ఇదే కుతూహలం బర్మింగ్ హామ్ వరకు రప్పించింది. 

ఎడ్జ్ బాస్టన్ స్టేడియంలో జరిగిన  ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ ను గూగుల్ సీఈవో సుందర్ ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా అతడు ప్రపంచ కప్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కలుసుకున్నాడు. వీరిద్దరి మధ్య కాస్సేపు క్రికెట్, ప్రపంచ కప్, టీమిండియా ప్రదర్శన గురించి మాటలు కొనసాగాయి. చివర్లో వీరిద్దరు కలిసి ఓ ఫోటోకు పోజిచ్చారు. 

ఈ ఫోటోను బిసిసిఐ అధికారికి ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ''మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇవాళ్టి మ్యాచ్(ఇండియా-ఇంగ్లాండ్)ను ప్రత్యక్షంగా వీక్షించారు'' అని బిసిసిఐ పేర్కొంది. 

భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అందులోనే భారత జట్టు ఆడే మ్యాచులంటే మరింత ఇష్టం. అందువల్లే బిజీ బిజీగా గడిపే అతడు అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్ లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు మైదానంలో వాలిపోతాడు. ఇదే విధంగా ప్రపంచకప్‌లో భాగంగా జరుగుతున్న ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్ ను ప్రత్యేక అతిథిగా  పిచాయ్ హాజరయ్యారు.