స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో ఇంగ్లాండ్ ఎట్టకేలకు సెమీఫైనల్ కు చేరి ఓ అరుదైన ఘనత సాధించింది. నిన్న(బుధవారం) జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి 119 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు ఘన విజయం సాధించింది. దీంతో ఈ ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరిన మూడో జట్టుగా నిలిచింది. అయితే ఇప్పటివరకు ఒక్క ప్రపంచ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలవలేకపోయిన ఇంగ్లాండ్ ఈసారి ఎలాగైనా గెలిచి తన సత్తాను ప్రపంచానికి చాటాలనుకుంటోంది. అందులో భాగంగా ఆ జట్టు గత 27 ఏళ్లుగా సాధించలేని ఓ అరుదైన మైలురాయిని మోర్గాన్ సేన అందుకుంది. 

క్రికెట్ కు పుట్టినిల్లయిన ఇంగ్లాండ్ 1992 తర్వాత జరిగిన ఏ ప్రపంచ కప్ లోనూ సెమీఫైనల్ కు చేరుకోలేకపోయింది. హేమాహేమీ ఆటగాళ్లు జట్టులో వున్నప్పటికి ప్రతిసారీ లీగ్ దశ నుండే వెనుదిరగడం ఆ జట్టుకు అలవాటుగా  మారింది. అయితే తాజాగా స్వదేశంలో జరుగుతున్న ఈ మెగా  టోర్నీలో లీగ్ అడ్డంకిని దాటుకుని సెమీస్ కు చేరింది.  ఇలా 27 ఏళ్ల తర్వాత సెమీస్ కలను నెరవేర్చుకున్న ఇంగ్లీష్ జట్టు ట్రోఫీని  కూడా గెలుచుకుని  తమ  చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని చూస్తోంది. 

న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ ఆ తర్వాత బౌలింగ్ లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది. టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ కు ఓపెనర్లు బెయిర్ స్టో(106 పరుగులు), జేసన్ రాయ్( 61 పరుగులు) అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వీరికి మోర్గాన్(40 పరుగులు) తోడవడంతో 305 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యఛేదనలో చతికిలపడ్డ కివీస్  కేవలం 186 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో ఆతిథ్యం  జట్టు 119 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని నేరుగా సెమీస్ కు చేరుకుంది.