ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండిస్ తక్కువ పరుగులకే ఆలౌట్ చేయడంలో ఇంగ్లీష్ బౌలర్లు సఫలమయ్యారు. కేవలం 212 పరుగులకే విండీస్ ను ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు విజయం వైపు దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో సంబరాలు చేసుకోవాల్సిన ఇంగ్లాండ్ జట్టులో ఆందోళన మొదలయ్యింది.. ఎందువల్లంటే ఈ మ్యాచ్ లో ఇద్దరు కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా ఫీల్డింగ్ చేయడంలో ఇబ్బందిపడటం. ఇలా ఆటగాళ్ళు గాయాలతో ఇబ్బందిపడటం ఆ జట్టును ఆందోళనలోకి నెట్టింది. 

ముఖ్యంగా ఓపెనర్ జాసన్ రాయ్ ఆరంభంలోనే తొండ కండరాలు పట్టేయడంతో మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో సబ్స్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ చేశాడు. మొత్తం విండీస్ బ్యాటింగ్ ముగిసేవరకు రాయ్ పెవిలియన్ కే పరిమితమయ్యాడు. దీంతో అతడి గాయంపై అభిమానుల్లోనే కాదు జట్టు లోనూ ఆందోళన మొదలయ్యింది. 

ఇక పీల్డింగ్ మొత్తానికి అతడు దూరమయ్యాడు కాబట్టి రాయ్ ఓపెనింగ్ చేయలేకపోయాడు. ఐసిసి నిబంధనల ప్రకారం ఏ ఆటగాడయితే సబ్స్టిట్యూట్ తో ఫీల్డింగ్ చేయిస్తూ మైదానం బయట ఎంతసేపయితే వుంటాడో అంత సమయంలోపు అతడు బ్యాటింగ్ కు దిగే అవకాశం వుండదు. అయితే ఆ సమయానికంటే ముందే జట్టు  వెంటవెంటనే వికెట్లు కోల్పోయిన పక్షంలో ఏడో స్థానం తర్వాత అతడు బ్యాటింగ్ కు దిగొచ్చు. కాబట్టి జాసన్ రాయ్ ఇవాళ దాదాపు బ్యాటింగ్ కూడా చేయకపోవచ్చు. 

ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ కూడా వెన్నునొప్పితో బాధపడుతూ మైదానాన్ని వీడాడు. మరో 28 నిమిషాల్లో విండీస్ బ్యాటింగ్ ముగుస్తుందనగా అతడు గాయంతో విలవిల్లాడిపోయాడు. దీంతో అతడి స్థానంలో కూడా మరో సబ్స్టిట్యూట్ ఆటగాడు ఫీల్డింగ్ చేశాడు. ఇలా ఇంగ్లాండ్ జట్టులో విండీస్ ను తక్కువ పరుగులకే కట్టడి  చేశామన్న ఆనందం కంటే కీలక ఆటగాళ్ళు గాయాలదో మైదానాన్ని వీడారన్న ఆందోళనే ఎక్కువగా కనిపించింది.