ప్రపంచ కప్ సీజన్ 12 లో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఆదివారం  రసవత్తర పోరు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో చివరకు ఆతిథ్య ఇంగ్లాండ్ దే పైచేయిగా నిలిచింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుపై ఆరంభంలోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు చేలరేగారు. దీంతో ఆతిథ్య జట్టు భారీ స్కోరు సాధించి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టి విజయాన్ని అందుకుంది. ఇలా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ ఓపెనర్లు భారత జట్టును ఓడించడమే కాదు ఓ అరుదైన రికార్డును కూడా నెలకొల్పారు. 
 

ఇంగ్లాండ్ ఓపెనర్లు జేసన్ రాయ్, బెయిర్ స్టో లు భారత బౌలర్లపై ఆరంభంనుండే ఎదురుదాడికి దిగారు. అటాకింగ్ ప్రదర్శనతలో వారిద్దరే 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. బెయిర్ స్టో(111 పరుగులు) సెంచరీ, రాయ్(66 పరుగులు) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో ఓ అరుదైన రికార్డు బద్దలయ్యింది. 

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకు భారత్ పై అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 138 పరుగులు మాత్రమే. ఇదే బర్మింగ్ హామ్ వేదికన 1979 లో భారత్-వెస్టిండిస్ మ్యాచ్ లో ఈ రికార్డు నమోదయ్యింది. విండీస్ ఓపెనర్లు గ్రీనిడ్జ్-హెయిన్స్ లు భారత బౌలర్లను  ధీటుగా ఎదుర్కొని 138 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే టీమిండియాపై ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. ఇలా నలబయ్యేళ్ల పాటు కొనసాగిన రికార్డు తాజాగా రాయ్, బెయిర్ స్టో ల అద్భుత ఇన్నింగ్స్ తో బద్దలయ్యింది. 

వీరిద్దరి విజృంభణతో మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ  లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన టీమిండియా 306 పరుగులకే పరిమితమయ్యింది. సెంచరీతో రోహిత్, హాఫ్ సెంచరీతో కోహ్లీ, మెరుపు ఇన్నింగ్స్ తో పాండ్యా పోరాడినా భారత జట్టును గెలిపించలేకపోయారు.