ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొంటున్న ప్రతి జట్టు ఎదుర్కొంటున్న ఏకైక సమస్య గాయాలు. ఈ టోర్నీలో భాగంగా జరుగుతున్న మ్యాచుల్లో ఆటగాళ్లకు గాయాలవడం లేదా గత గాయాలు తిరగబెట్టడం వంటి కారణాలతో ఇప్పటికే చాలామంది ఆటగాళ్లు ఈ మెగా టోర్నీకే దూరమయ్యారు. మరికొందరేమో తాత్కాలికంగా కొన్ని మ్యాచులకు దూరమవ్వాల్సి వచ్చింది. అలా తాజాగా ఆతిథ్య ఇంగ్లాండ్ కు ఓపెనర్ జాసన్  రాయ్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ గాయాల కారణంగా పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. 

ఇటీవల వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఘనవిజయాన్ని అందుకున్నప్పటికి ఆనందించలేని విచిత్ర పరిస్థితిని ఆ జట్టు ఎదుర్కొంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో తొడ కండరాలు పట్టేయడంతో జేసన్ అర్థాంతరంగా మైదానం నుండి వెనుదిరగాల్సి వచ్చింది. అతడి స్థానంలో సబ్స్టిట్యూట్ ఆటగాడు  ఫీల్డింగ్ చేశాడు. అనంతరం లక్ష్యఛేదనలో కూడా  రాయ్ బ్యాటింగ్ కు రాకపోవడంతో ఈ గాయం తీవ్రత అర్థమయ్యింది. తాజాగా రాయ్ తదుపరి రెండు  మ్యాచులకు దూరం కానున్నట్లు ఇంగ్లాండ్ మేనేజ్ మెంట్ ప్రకటించింది.  

ప్రస్తుతం అతడు వైద్యుల పర్యవేక్షణలో వున్నట్లు అధికారులు తెలిపారు. అతడి గాయానికి చికిత్స కొనసాగుతోందని... తదుపరి ఇంగ్లాండ్ ఆడే అప్ఘాన్, శ్రీలంక మ్యాచుల్లో అతడు అందుబాటులో వుండకపోవచ్చని ప్రకటించింది. అయితే ఆ తర్వాతి మ్యాచ్ కు ఖచ్చితంగా జట్టులోకి వస్తాడో లేడో కూడా ఇప్పుడే చెప్పలేమంటూ ఇంగ్లాండ్ జట్టు మేనేజ్ మెంట్ ట్విస్ట్ ఇచ్చింది.  

ఇక ఇదే మ్యాచ్ లో గాయపడ్డ కెప్టెన్ మోర్గాన్ పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే వున్నట్లు సమాచారం. మంగళవారం అప్ఘాన్  తో జరిగు మ్యాచ్ లో అతడు కూడా  అందుబాటులో వుండకపోవచ్చని సమాచారం. అప్ఘాన్ చిన్న జట్టే కాబట్టి ఈ మ్యాచ్ మోర్గాన్  ను ఆడించి రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నాట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే అప్ఘాన్ మ్యాచ్ లో ఓపెనర్ రాయ్, మోర్గాన్ ఇద్దరూ ఆడకపోవచ్చు.