ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ బరిలోకి దిగిన జట్టు ఇంగ్లాండ్. స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం, గతకొంత కాలంగా అద్భుత విజయాలతో దూసుకుపోతండటం, ఆటగాళ్ల ఫామ్ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ జోరు కొనసాగుతుందని అందరు భావించారు. అందుకు తగ్గట్లుగానే ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు అలవోకగా సెమీస్ కు చేరేలా కనిపించింది. కానీ ఆసిస్, శ్రీలంక చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన ఆతిథ్య జట్టు సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దీంతో ఆరంభంలో జట్టును పొగిడిన మాజీలు, అభిమానులే ఇప్పుడు విమర్శలకు దిగుతున్నారు. 

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ పీటర్సన్, ఆటగాడు మైకెల్ వాన్ లు మోర్గాన్ సేనపై నిప్పులు చెరిగారు. ఈ టోర్నీలో ఓటములతో సతమతమవుతున్న శ్రీలంక వంటి జట్టు చేతిలో కూడా ఇంగ్లాండ్ ఓటమిపాలవ్వడం సిగ్గుచేటని అన్నారు. ఇది ఆటగాళ్ల చెత్త ఆటతీరుకు నిదర్శమని వాన్ విరుచుకుపడ్డాడు. ఇక ఆసిస్ బౌలర్లను ఎదుర్కోవడంలో ఇంగ్లీష్ జట్టు మరీ ముఖ్యంగా కెప్టెన్ మోర్గాన్ వెనుకడుగు వేశాడని పీటర్సన్ మండిపడ్డాడు. 

అయితే ఇలా జట్టుపై విమర్శలకు దిగిన మాజీలకు ఓపెనర్ బెయిర్ స్టో పరోక్షంగా చురకలు అంటించాడు. '' ఇంగ్లాండ్ చాలా కాలంగా మంచి క్రికెట్ ఆడుతోంది. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అనుకూలించక ఓడిపోవాల్సి వచ్చింది. అలాగే ఈ ప్రపంచ కప్ లోనూ జరిగింది. ఇలాంటి సమయంలో జట్టుకు అండగా వుండాల్సిన వారే విమర్శలకు దిగడం  సరికాదు. అయినా వారికి మేం గెలవడం కంటే ఓడిపోవడమే ఆనందంగా వున్నట్లుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్నపుడు ప్రశంసించలేకపోయాన వారంతా ఇప్పుడు భయటకు వచ్చి విమర్శలకు దిగుతున్నారు. మేం ప్రపంచ కప్ సాధించడం వారికి ఇష్టం లేనట్లుంది'' అంటూ ఘాటుగా స్పందించాడు. 

అయితే ఇలాంటి విమర్శలను పట్టించుకోకూడదని సహచరులకు బెయిర్ స్టో సూచించాడు. క్లిష్ట సమయాల్లో ఆటగాళ్లకు  అండగా నిలవాల్సింది పోయి ఇలా విమర్శిస్తూ ఒత్తిడిలోకి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. ఇలాంటి విమర్శలు మా ఆత్మవిశ్వాసాన్ని ఏమాత్రం దెబ్బతీయలేవని బెయిర్ స్టో పేర్కొన్నాడు.