స్వదేశంలో జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ టీం ఆరంభంలో అదరగొట్టినా ప్రస్తుతం కష్టాల్లో పడింది. ఇప్పటివరకు 7 మ్యాచులాడిన ఆతిథ్య జట్టు నాలుగింట గెలిచి మూడిట్లో ఓడిపోయింది. దీంతో సెమీస్ కు చేరాలంటే తదుపరి భారత్, న్యూజిలాండ్ లతో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ తప్పకుండా గెలవాల్సి వుంటుంది.  కాబట్టి ఈ రెండు మ్యాచుల్లో తమ జట్టు విజయం కోసం జో రూట్ సహచర ఆటగాళ్లకు కొన్ని సలహాలు, సూచనలు చేశాడు. 

ముఖ్యంగా బర్మింగ్ హామ్ వేదికగా భారత్ తో జరిగే మ్యాచ్ చాలా కీలకమని రూట్ తెలిపాడు. ఈ మ్యాచ్ ద్వారా తిరిగి తాము ఫామ్ ను అందిపుచ్చుకుని విజయాల బాట పట్టాల్సి వుంటుంది. కాబట్టి  కీలకమైన ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఎలాంటి ఒత్తిడికి  లోనవ్వకుండా ఆడాలని సూచించాడు. అంతేకాకుండా ఆటగాళ్లు భావోద్వేగాన్ని పక్కనపెట్టి మామూలు మ్యాచ్ ఆడుతున్నట్లే ఆడాలన్నాడు. చివరివరకు పోరాటపటిమను కొనసాగించాలని...ఎట్టి పరిస్థితుల్లో ఓటమిని అంగీకరించకూడదని రూట్ సహచరులకు సూచించాడు. 

ఈ మ్యాచ్ లో టీమిండియాను ఓడించగలిగితే తమపై చాలా ఒత్తిడి తగ్గుతుందన్నాడు. అప్పుడు అదే ఊపుతో న్యూజిలాండ్ ను కూడా సమర్ధవంతంగా ఎదుర్కోగలమని తెలిపాడు. కానీ భారత్ వంటి బలమైన జట్టుపై ఒకవేళ తాము గత మ్యాచుల మాదిరిగానే ఆడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని రూట్ తెలిపాడు.  
 
గత రెండు మ్యాచుల్లో శ్రీలంక, ఆస్ట్రేలియా చేతిలో  తాము ఓడిపోవడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయన్నాడు. కాబట్టి మిగిలిన రెండు మ్యాచులను క్వార్టర్ ఫైనల్ మాదిరిగా భావించి ఆడతామన్నాడు. అందుకోసం ఆటగాళ్లు ఆవేశంగా కాకుండా ప్రశాతంగా, ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా వుండాలని రూట్ సలహాఇచ్చాడు.