ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సెమీస్ కు చేరింది. అయితే మిగిలిన సెమీస్, ఫైనల్ రెండు మ్యాచుల్లో గెలిస్తే టీమిండియా మరోసారి విశ్వవిజేతగా నిలవనుంది. టీమిండియా విజయపరంపర ఇలాగే కొనసాగి మూడో ట్రోఫీతో స్వదేశానికి తిరిగి రావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా ఇంగ్లాండ్ పుట్ బాల్ స్టార్ హ్యారీ కేన్ కూడా ఇదే కోరికను వ్యక్తపర్చాడు. ప్రపంచ  కప్ లో మిగిలిన అన్ని మ్యాచుల్లో కోహ్లీసేన విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపాడు. 

టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కి పుట్ బాల్ అంటే ఎంతిష్టమో అందరికి తెలిసిందే. దీంతో అతడు ఇండియన్ పుట్ బాల్ ప్లేయర్స్ తోనే కాకుండా అంతర్జాతీయ స్టార్ ప్లేయర్స్ తో కూడా స్నేహాన్ని కొనసాగిస్తుంటాడు. ఇలా ఇంగ్లీష్ పుట్ బాల్ ప్లేయర్ హ్యారీకేన్ తో కూడా అతడికి మంచి స్నేహం వుంది. దీంతో వీరిద్దరు తాజాగా లండన్ లోని లార్డ్స్ మైదానంలో సరదాగా కలుసుకున్నారు. 

ఈ సందర్భంగా  కోహ్లీ, హ్యారికేన్ లు సరదాగా క్రికెట్ ఆడారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే హ్యారీ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. అంతేకాకుండా మైదానంలో సరదాగా కలియతిరుగుతూ వీరిద్దరు మాట్లాడుతూ కనిపించారు. 

ఇలా కోహ్లీతో కలిసి సరదాగా గడిపిన వీడియోను హ్యారీ  ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. '' ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీతో కొద్దిసేపు గడిపాను. ఈ  సందర్భంగా మిగతా ప్రపంచకప్‌ మ్యాచులన్నింటిలో కోహ్లీ రాణించాలని శుభాకాంక్షలు తెలిపాను. కానీ ఇంగ్లాండ్‌ పై ఆడినప్పుడు తప్ప'' అంటూ ఆ వీడియోకు కామెంట్ జతచేశాడు.